న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కి ఐటీ నోటీసులు

న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కి ఐటీ నోటీసులు
‘ఎల్‌2 ఎంపురాన్’ చిత్ర నిర్మాత‌ల్లో ఒకరైన కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, శ్రీ గోకులం చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ అధినేత గోకులం గోపాలన్ కార్యాల‌యల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి)శుక్రవారం ఉదయం సోదాలు చేపట్టిన వివాదం స‌ద్దుమ‌ణ‌గ‌క‌ముందే  ఎల్ 2 ఎంపురాన్ ద‌ర్శ‌కుడు న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కి ఐటీ డిపార్ట్‌మెంట్‌ నుంచి నోటీసులు అందాయి. 
 
2022లో పృథ్వీరాజ్ న‌టించిన మూడు చిత్రాలైన ‘జన గణ మన’, ‘గోల్డ్’, ‘కడువ’ సినిమాల‌కు సంబంధించి ఈ సినిమాల‌కు వ‌చ్చిన ఆదాయంపై వివర‌ణ ఇవ్వాల‌ని కోరుతూ నోటీసులు అందిన‌ట్లు తెలుస్తుంది. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఈ మూడు సినిమాల‌ను నిర్మించ‌గ, ఈ మూడు చిత్రాల‌కు పృథ్వీరాజ్ సుకుమారన్ పారితోషికం తీసుకోలేదు. 
 
అయితే ఈ మూడు సినిమాల వ‌ల‌న రూ.40 కోట్లు లాభం వ‌చ్చిన‌ట్లుగా పృథ్వీరాజ్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని, వీటికి సంబంధించి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరుతూ నోటీసుల‌లో పేర్కొంది. ఈ నోటీసుల‌కు సంబంధించి ఏప్రిల్ 29 వ‌ర‌కు పృథ్వీరాజ్ స‌మాధాన‌మివ్వాల‌ని ఐటీ శాఖ ఆదేశించిన‌ట్లు స‌మాచారం. ఐటీ శాఖ నోటీసుల‌పై పృథ్వీరాజ్ తల్లి న‌టి మల్లిక సుకుమారన్ మాట్లాడుతూ.. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని, విచారణకు భయపడాల్సిన అవసరం లేదని మీడియాతో చెప్పారు. ఈ విషయంలో ఆయన తగిన సమాధానం ఇస్తారని ఆమె తెలిపారు.
మోహన్‌లాల్‌ హీరోగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ చిత్రం మార్చి 27న విడుదలైంది. అయితే ఈ మూవీలో 2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న గోద్రా అల్లర్లు సంబంధించి స‌న్నివేశాలు ఉన్నాయి. ఈ మూవీలో బాల్‌రాజ్‌ భజరంగీ అనే వ్య‌క్తి ముస్లింలను కిరాత‌కంగా చంప‌డం చూపించారు. దీంతో ఈ చిత్రం హిందూ వ్యతిరేక అజెండాను ప్రోత్సహిస్తోందని విమర్శలు చెలరేగాయి. దీంతో సెన్సార్ స‌భ్యులు ఈ మూవీని రీ సెన్సార్ చేసి 51 క‌ట్స్ చెప్పారు.