ఆ 25 వేల టీచర్ల నియామకాలు చెల్లవు

ఆ 25 వేల టీచర్ల నియామకాలు చెల్లవు
 
* సుప్రీంలో మమతా ప్రభుత్వంకు భారీ ఎదురు దెబ్బ

బంగాల్‌ రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ కేసులో దాఖలైన పిటిషన్లపై దర్యాప్తు చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 25,753 టీచర్ల నియామకాలను చెల్లవని సుప్రీం స్పష్టంచేసింది. 

ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా ధర్మాసనం సమర్థించింది. ఆ పోస్టులకు సంబంధించి చేపట్టిన నియామక ప్రక్రియ మలినపడిందని ధర్మాసనం ఆక్షేపించింది. టీచర్ల నియామక ప్రక్రియ చట్టవిరుద్దంగా ఉందని కోల్కతా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. 

అయితే, ఈ తీర్పుతో ప్రభావిత ఉపాధ్యాయులకు కాస్త ఊరట కల్పించింది. ఈ నియామక ప్రక్రియ కింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు అప్పటివరకు అందుకున్న వేతనాలు, ఇతర భత్యాలను తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించింది.  మానవీయ కోణంలో ఆలోచించి ఆ నియామకాల ద్వారా కొలువులు సాధించిన దివ్యాంగులు యథావిథంగా తమ ఉద్యోగాలు చేసుకోవచ్చని తీర్పునిస్తున్నట్లు తెలిపింది. మూడు నెలల్లోగా కొత్త నియామక ప్రక్రియ చేపట్టి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది.

అంతకుముందు ఈ కుంభకోణంపై గతేడాది ఏప్రిల్‌లో కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి స్టేట్‌ లెవల్‌ సెలక్షన్‌ టెస్ట్‌ (ఎస్ఎల్ఎస్ టి) టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది నియామక ప్రక్రియ చెల్లదని స్పష్టం చేసింది. ఆ పరీక్షతో జరిపిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది.  అంతేగాక, దీనికింద ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని వెల్లడించింది. ఈ క్రమంలోనే తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం ఫిబ్రవరి 10న తీర్పును రిజర్వ్‌లో పెట్టి తాజాగా వెలువరించింది. 

ఇక, ఈ కుంభకోణంపై మరింత సమగ్ర దర్యాప్తు జరపాలని గతంలోనే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. దీన్ని సవాల్‌ చేస్తూ దీదీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏప్రిల్‌ 4న విచారణ జరుపుతామని ధర్మాసనం వెల్లడించింది. ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్‌ సి, గ్రూప్‌ డి స్టాఫ్‌ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్‌ సర్కారు రాష్ట్ర స్థాయి సెలక్షన్‌ పరీక్ష చేపట్టింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు 23 లక్షల మందికి పైగా పరీక్ష రాశారు.

అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చారు. కానీ, ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, దీనిపై దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇంకా కుంభకోణానికి సంబంధించిన కేసులో మాజీ విద్యాశాఖ మంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పార్థా ఛటర్జీని ఈడీ అరెస్టు చేసింది.