రేవంత్ బిసి రేజర్వేషన్ల ఏగవేతకే ఢిల్లీ ధర్నా!

రేవంత్ బిసి రేజర్వేషన్ల ఏగవేతకే ఢిల్లీ ధర్నా!

బీసీ రిజర్వేషన్ల పేరు చెప్పి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాల ముసుగులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నాకు దిగడం 42 శాతం రిజర్వేషన్ల అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నమే అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు కల్పించడంలో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని తాము ముందు నుంచీ చెప్తున్నది ఇప్పుడు మరోసారి నిరూపితమైందని ఆయన ధ్వజమెత్తారు. 

బీసీలను కేవలం ఓటుబ్యాంకుగానే చూస్తున్న రేవంత్ రెడ్డికి ఎంతసేపూ వారిని వాడుకొని వదిలేయాలన్న ఆలోచనే తప్పితే వారి అభివృద్ధి కాదని స్పష్టం చేశారు.  బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని మీరు హామీ ఇచ్చి ఇప్పుడు కేంద్రంపై నెపం ఎలా నెడుతారు? బీసీ రిజర్వేషన్ల పెంపు మీ పరిధిలో లేకపోతే, ఎలా హామీ ఇచ్చారు? అని ప్రశ్నించారు. 

బీసీ రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేకనే రేవంత్ రెడ్డి ఈ డ్రామాలాడుతున్నారని పేర్కొంటూ రేవంత్ రెడ్డి అసలైన బీసీ ద్రోహి అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీయే రేవంత్ రెడ్డి వెనకుండి ఈ డ్రామాలు ఆడిస్తున్నాడని ఆరోపించారు. ఒక బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అయితే జీర్ణించుకోలేక నరేంద్ర మోదీని రాహుల్ గాంధీ అసభ్యంగా తూలనాడిన విషయాన్ని బీసీలు ఇంకా మరచిపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మోదీ అనే ఇంటి పేరున్న వారంతా దొంగలే అంటూ రాహుల్ గాంధీ తన బీసీ వ్యతిరేకతను బాహాటంగానే చాటుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ముందు నుంచీ బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటూ వచ్చిందని చెబుతూ తొలి ప్రధాని నెహ్రూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నారని, ఇందిరా గాంధీ కూడా బీసీ రిజర్వేషన్ల అమలును తొక్కిపెట్టారని విమర్శించారు. 

మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని నాటి ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రయత్నిస్తే, నాడు రాజీవ్ గాంధీ పార్లమెంట్ వేదికగానే తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. వారి వారసత్వంలోనే రాహుల్ గాంధీ బీసీ వ్యతిరేకతను నరనరాన నింపుకొన్నారని, రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డిని ముందు పెట్టి రాహుల్ గాంధీ డ్రామాలు ఆడిపిస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదని పేర్కొంటూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పారు, తర్వాత మరచిపోయారని ధ్వజమెత్తారు. ప్రజల నుంచి ముఖ్యంగా బీసీల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో మరో గత్యంతరం లేక 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును పాస్ చేశారు తప్పితే, బీసీల బాగు కోరి కాదని స్పష్టం చేశారు. 

బీసీ సంక్షేమం కోసం ఏడాదికి రూ.20,000 కోట్లు చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామన్నారని, కానీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్ లలోనూ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తెలిపారు.