శాంతి చర్చలకు సిద్ధం అంటూ మావోయిస్టుల లేఖ

శాంతి చర్చలకు సిద్ధం అంటూ మావోయిస్టుల లేఖ

భారత్‌ని మావోయిస్ట్‌ రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌’ను దూకుడుగా కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్లలో గత వందరోజుల్లోనే భద్రతా బలగాలు 120 మందికి పైగా మావోయిస్టులను హతమార్చాయి. దానితో మావోయిస్టులు ఒక్కసారిగా తమ స్వరం మార్చారు.

ఇటీవల దండకారణ్యంతో పాటు వివిధ రాష్ర్టాల్లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మరణిస్తున్న వేళ మావోయిస్టు పార్టీ కీలక ప్రతిపాదన చేసింది. శాంతి చర్చలకు తాము సిద్ధమని తెలిపింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే మావోయిస్టులు తాజాగా శాంతి చర్చల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్రంతో చర్చలకు తాము సిద్ధమని ఓ లేఖ విడుదల చేశారు.
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పేరుతో ఈ లేఖ విడుదలైంది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ కేంద్రానికి ఒక లేఖను విడుదల చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తే కాల్పుల విరమణకు సిద్ధమని అందులో స్పష్టం చేశారు.

భద్రతా దళాలు పథకం ప్రకారం తమ పార్టీకి చెందిన పీఎల్‌జీ నిరాయుధ సభ్యులను అమానవీయంగా చిత్ర హింసలకు గురి చేస్తున్నాయని అభయ్‌ లేఖలో ఆరోపించారు.
మహిళా కామ్రేడ్స్‌పై పోలీసులు సామూహిక లైంగిక దాడులకు పాల్పడుతున్నారని అంటూ ఆరోపణలు గుప్పించారు. 400 మందికిపైగా తమ పార్టీ కార్యకర్తలను, కమాండర్లను, ఆదివాసీలను వారు హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రజా ప్రయోజనాల కోసం తాము ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధమేనని స్పష్టం చేశారు. అందుకు సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వాలే కల్పించాలని తెలిపారు. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో వివిధ రాష్ర్టాల్లో చేపట్టిన హత్యా కాండలను వెంటనే నిలిపివేయాలని ఆయన కేంద్రం, వివిధ రాష్ర్టాల ప్రభుత్వాలను కోరారు.
“ప్రజల కోసం ఎప్పుడైనా శాంతి చర్చలకు సిద్ధం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలి. యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌ను వెంటనే నిలిపివేయాలి. ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణలో జరుపుతున్న హత్యాకాండను ఆపాలి” అని మావోయిస్టు కేంద్ర కమిటీ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది. 

“శాంతి చర్చలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూల వాతావరణం కల్పించాలి. అప్పుడు మేం వెంటనే కాల్పుల విరమణ పాటిస్తాం” అని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకొస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టులు ఆ లేఖలో స్పష్టం చేశారు. దీనికి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

అడవుల్లో సాయుధ బలగాల క్యాంపులను తొలగించి, శాంతి చర్చలకు అంగీకరిస్తే తక్షణమే తాము కాల్పుల విరమణ ప్రకటిస్తామన్నారు. శాంతి చర్చలకు మేధావులు, మీడియా ప్రతినిధులు, విద్యార్థి నేతలు, పర్యావరణ కార్యకర్తలు సహకరించాలని అభయ్‌ తన లేఖలో కోరారు.