మయన్మార్‌కు భారత్ 625 మెట్రిక్‌ టన్నుల సాయం

మయన్మార్‌కు భారత్ 625 మెట్రిక్‌ టన్నుల సాయం
భారీ భూకంపంతో మయన్మార్, థాయ్‌లాండ్ ప్రజల జీవనవిధానం అస్తవ్యస్తంగా మారింది. ప్రకృతి విపత్తుతో అల్లాడిపోతున్న ఆ దేశానికి భారత్‌ తన సాయాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 625 మెట్రిక్‌ టన్నుల సహాయక సామగ్రిని భారత్‌ అందించింది.  ఆపరేషన్‌ బ్రహ్మ’లో భాగంగా 625 మెట్రిక్‌ టన్నుల మానవతా సాయం, విపత్తు నివారణ సామగ్రిని మయన్మార్‌కు అందించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. 

సహాయక కార్యక్రమాల నిమిత్తం 6 విమానాలు, 5 నేవీ నౌకలు వినియోగించినట్లు వెల్లడించింది. ప్రకృతి విపత్తు సంభవించినప్పటినుంచి భారత్‌ ఇప్పటివరకు మూడు విడతలుగా తన సాయాన్ని పంపించినట్లు పేర్కొంది భారత విదేశాంగ శాఖ.  అందులో ఆహార పదార్థాలు, తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్‌ బ్యాగ్స్‌, వాటర్‌ ప్యూరిఫయర్లు, సోలార్‌ ల్యాంప్‌, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలతో పాటు 80 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా ఉన్నారు. 

ఆపరేషన్‌ బ్రహ్మ కింద ఐఎన్‌ఎస్‌ సాత్పురా, ఐఎన్‌ఎస్‌ సావిత్రి నౌకలు శనివారం బయల్దేరి సోమవారం మయన్మార్‌కు చేరుకున్నాయి.అవి 50 టన్నుల సామగ్రిని  యాంగూన్‌లో అందజేశాయి. మరో రెండు నౌకలు మంగళవారం చేరాయి. మయన్మార్‌లోని మాండలేలో 200 పడకల సామర్థ్యంతో ఒక తాత్కాలిక ఆసుపత్రిని కూడా భారత సైన్యం ఏర్పాటుచేసింది. అందులో 118 మంది సేవలందిస్తున్నారు. 

442 టన్నుల సహాయక సామగ్రితో ఐఎన్‌ఎస్‌ ఘరియాల్‌ నౌక మంగళవారం విశాఖపట్నం నుంచి బయల్దేరింది. అందులో బియ్యం, వంటనూనెతో సహా ఔషధాలు ఉన్నాయి. ఈసందర్భంగా మయన్మార్‌కు మరింత సాయం అందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని విదేశాంగ శాఖ తెలిపింది. నిమిషాల వ్యవధిలో వచ్చిన భారీ భూకంపాలతో ఇటీవల మయన్మార్‌ కుదేలైంది. 

బలమైన ప్రకంపనల ధాటికి పలు నిర్మాణాలు, భవనాలు ఎక్కడికక్కడ పేకమేడల్లా కూలిపోయాయి. దీంతో సహాయక చర్యలకు పెను సవాల్‌గా మారింది.  ఇప్పటివరకు 2,719 మంది మృతదేహాలను వెలికితీశారు. స్థానిక మీడియా తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. మృతుల్లో 5 ఏళ్లలోపు చిన్నారులు 50 మంది ఉన్నారని తెలిపింది. మరో 4,521 మంది గాయపడ్డారని, ఇంకో 441 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని పేర్కొంది. మృతుల సంఖ్య పెరుగుతుందని భయపడుతున్నారు.