మార్చిలో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

మార్చిలో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు
మార్చిలో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రోజురోజుకూ పెరుగుతూ, దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని అందిస్తున్నాయి. తాజాగా, మార్చి నెలలో  జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ. 1.96 లక్షల కోట్లకు చేరాయి. ఇది గత ఏడాది మార్చితో పోలిస్తే 9.9 శాతం ఎక్కువగా ఉంది. 
 
ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం, దేశంలో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకోవడం, పన్ను చెల్లింపుల్లో మెరుగుదల కనిపించడం వంటివి ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ వ్యాప్తంగా రూ. 1.84 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం నమోదైన సంగతి తెలిసిందే. అయితే, మార్చిలో ఈ సంఖ్య 6.8 శాతం పెరిగి రూ. 1.96 లక్షల కోట్లను తాకింది. 
 
దీనిలో, కేంద్ర జీఎస్టీ రూపంలో రూ. 38,100 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూపంలో రూ. 49,900 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కింద రూ. 95,900 కోట్లు, కాంపెన్సేషన్ సెస్ ద్వారా రూ. 12,300 కోట్ల ఆదాయం లభించింది.  దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో ముందున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ అగ్రస్థానాల్లో నిలిచాయి.మహారాష్ట్ర రూ. 31,534 కోట్ల వసూళ్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇది గత ఏడాది మార్చితో పోలిస్తే 14 శాతం ఎక్కువ. కర్ణాటక రూ. 13,497 కోట్ల ఆదాయంతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 4 శాతం పెరుగుదల. గుజరాత్ రూ. 12,095 కోట్ల జీఎస్టీ వసూలు చేసి, 6 శాతం వృద్ధిని నమోదు చేసింది.

తమిళనాడు రూ. 11,017 కోట్లతో 7 శాతం పెరుగుదల సాధించింది. ఉత్తరప్రదేశ్  రూ. 9,956 కోట్ల జీఎస్టీ వసూళ్లతో 10 శాతం వృద్ధిని సాధించింది. ఢిల్లీ రూ. 6,139 కోట్ల ఆదాయంతో ఆరో స్థానంలో నిలిచింది. ఇది గత ఏడాది మార్చితో పోలిస్తే 5 శాతం పెరుగుదల. అయితే, బీహార్ అత్యల్పంగా రూ. 2.6 కోట్లు మాత్రమే జీఎస్టీ చెల్లించింది. 

లక్షద్వీప్ రూ. 3 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ. 4,033 కోట్లతో కాస్త మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఈ నెలలో అండమాన్, నికోబార్ దీవులు అత్యధిక వృద్ధిని సాధించాయి. ఈ దీవుల్లో జీఎస్టీ వసూళ్లు ఏకంగా 60 శాతం పెరిగి రూ. 51 కోట్లకు చేరాయి. జీఎస్టీ వసూళ్లు స్థిరంగా పెరుగుతుండటాన్ని ఆర్థిక నిపుణులు మంచి సంకేతంగా భావిస్తున్నారు. 

వ్యాపార కార్యకలాపాలు మరింత బలోపేతం కావడంతో పాటు, పన్ను వ్యవస్థలో అవగాహన పెరగడం, చెల్లింపుల్లో నియమ నిబంధనలను కచ్చితంగా పాటించడం వంటి అంశాలు ఈ వృద్ధికి దోహదం చేస్తున్నాయి. వచ్చే నెలల్లో కూడా వసూళ్లు పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.