
తెలంగాణలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. శిల్పా రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో జర్మనీ యువతిపై జరిగిన అత్యాచారయత్నం ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు. బాధితురాలిని మీర్ పేట్ కార్పొరేటర్ మల్లేష్, మహేశ్వరం కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీరాములు యాదవ్ లతో కలిసి పరామర్శించి, ఈ విషాద సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కేసులో పోలీసు అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా నిందితులను అరెస్ట్ చేయకపోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం నేరస్థులకు స్వర్గధామంగా మారడంతో మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడం దురదృష్టకరమని తెలిపారు.
ఇటీవల హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న యువతిపై లైంగికదాడి యత్నం, పహాడీ షరీఫ్‌లో జర్మనీ యువతిపై ముగ్గురు యువకుల అత్యాచారం, బాలీవుడ్ టీవీ నటిపై నగరంలో జరిగిన లైంగిక దాడి, నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండపేట అంజన్న ఆలయం వద్ద యువతిపై ఆకతాయిల దాడి లాంటి ఘోరమైన ఘటనల పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
రోజురోజుకూ ఇటువంటి ఘటనలు పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడంలో అప్రమత్తంగా వ్యవహరించడం లేదని శిల్పా రెడ్డి ఆరోపించారు. ఓవైపు అధికార పార్టీ అండతో, రాజకీయాల ముసుగులో నేరస్థులు నేడు మహిళల జీవితాలతో ఆటలాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. జర్మనీ యువతిపై అత్యాచారయత్నం ఘటనలో ముస్లిం వర్గానికి చెందిన నిందితులకు వత్తాసు పలకడం అన్యాయమని శిల్పారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వార్థ రాజకీయాల కోసం నేరస్థులను రక్షించడం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని మండిపడ్డారు. మహిళా భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను సరైన విధంగా నిర్వహించడం లేదని ఆరోపించారు. హైదరాబాద్‌లో మహిళా భద్రత కోసం పోలీసు పెట్రోలింగ్‌ను పెంచాలని, మహిళా భద్రత కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ విస్తృతంగా పనిచేయాలని, సీసీటీవీ నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని, రైల్వే, బస్టాండ్లలో ప్రత్యేక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా జర్మనీ మహిళపై అత్యాచారయత్నం కేసులో నిందితులను వెంటనే పట్టుకుని, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని, రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని డా. శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. నిందితులను రక్షించేందుకు ప్రభుత్వం కుట్రలు చేయడం మానుకోవాలని పేర్కొంటూ న్యాయం కోసం బిజెపి పోరాడుతుందని ఆమె తేల్చిచెప్పారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి