కంచె గచ్చిబౌలి భూములపై తక్షణమే నివేదిక పంపండి

కంచె గచ్చిబౌలి భూములపై తక్షణమే నివేదిక పంపండి

హైదరాబాద్ కంచె లోని గచ్చిబౌలి (హెచ్ సీయూ) భూములపై తక్షణమే నివేదికను పంపాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ కుమార్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జి.నగేశ్, రఘునందన్ రావు తదితరులు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిసి ఈ విషయమై వినతి పత్రం సమర్పించారు.

కంచె గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని వారు కోరారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల పర్యావరణ, హెరిటేజ్ భూములని పేర్కొన్నారు.
హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచె గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరమని ఈ సందర్బంగా వారు భూపేంద్ర యాదవ్ ద్రుష్టికి తీసుకొచ్చారు. అనేక రకాల ఔషధ మొక్కలు, వివిధ పక్షి జాతులతో ఆ ప్రాంతమంతా అలరారుతోందని పేర్కొన్నారు. 

ఇంతటి విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ గా మార్చి వేల కోట్లు దండుకోవాలని చూస్తోందని ఆరోపించారు. హెచ్ సీయూ విద్యార్థులతోపాటు యావత్ హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని ఆ భూములను పరిరక్షించాలని కోరారు. 

ఈ సందర్బంగా సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కంచె గచ్చిబౌలి భూములపై తక్షణమే నివేదిక ఇవ్వాలని అటవీ, పర్యావరణ శాఖ అధికారులను ఆదేశించారు. నివేదిక అందిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, హెచ్‌సీయూ భూములను అమ్ముకుని ఢిల్లీకి కప్పం కట్టాలని చూస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డిపై ఎంపీలు ఈటల, అర్వింద్‌ మండిపడ్డారు.

పర్యావరణంతో అలరారే భూముల్లో నెమళ్లు, ఔషధ మొక్కలను చంపేసి, ఆ స్థలాలను కాంక్రీట్‌ జంగల్‌గా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించిన 400 ఎకరాల భూమి విలువ రూ.40 వేల కోట్లు అని పేర్కొన్నారు. భూములను అమ్మి, కమీషన్లు తినాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌ ఉన్నారని మండిపడ్డారు.