ఏనుగు-డ్రాగన్‌ నృత్యం మాదిరిగా భారత్, చైనా సంబంధాలు

ఏనుగు-డ్రాగన్‌ నృత్యం మాదిరిగా భారత్, చైనా సంబంధాలు

భారత్‌తో సంబంధాలపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌- చైనాలు మరింత సన్నిహితంగా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు ఏనుగు-డ్రాగన్‌ నృత్యం మాదిరిగా ఉండాలని జిన్‌పింగ్‌ ఆకాంక్షించారు.  భారత్‌-చైనాల మధ్య దౌత్యసంబంధాలు ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయిన వేళ ఇరుదేశాధినేతలు పరస్పరం అభినందన సందేశాలు పంచుకున్నారు.

2020లో జరిగిన గల్వాన్‌ లోయ ఘర్షణ తర్వాత భారత్‌- చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కొన్ని రోజుల నుంచి సాధారణ స్థితికి చేరుకునే దిశగా సాగుతున్నాయి.  ఇరుగుపొరుగు దేశాలు శాంతియుతంగా కలిసి ఉండేందుకు మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఉందని జిన్‌పింగ్‌ గుర్తు చేశారు. ప్రధానంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో సమాచారం, సమన్వయం పెంచుకునేందుకు, సరిహద్దు ప్రాంతాల్లో శాంతిభద్రతలను సంయుక్తంగా కాపాడుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జిన్‌పింగ్‌ తన సందేశంలో స్పష్టం చేశారు.

భారత్‌-  చైనా మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి నేటికి 75 ఏళ్లు అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ చెప్పారు. చైనా అధ్యక్షుడు, ప్రధాని భారత రాష్ట్రపతి, ప్రధానిలతో అభినందన సందేశాలు ఇచ్చిపుచ్చుకున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.  రెండు దేశాలూ పురాతన నాగరికతలు కలిగి ఉన్నాయని, ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు అని తెలిపారు. గ్లోబల్‌ సౌత్‌లో ముఖ్యమైన సభ్యులైన ఇరు దేశాలూ ఆధునికీకరణలో కీలక దశలో ఉన్నాయని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ నాలుగు రోజులపాటు చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన భారత్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయిన యూనస్, రెండు దేశాల మధ్య తొమ్మిది కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.

అయితే ఈ చర్చల సమయంలో భారత దేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమిటనేదానిపై విశ్లేషకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. భారత్-చైనా సంబంధాలు గతంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, ప్రస్తుతం ఆర్థిక మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకునే దిశగా రెండు దేశాలు కృషి చేస్తున్నాయి. 

ముఖ్యంగా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడం, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం వంటి అంశాలు కీలకంగా మారాయి. భవిష్యత్తులో ఇరు దేశాలు ఉమ్మడిగా సహకరిస్తే, ఆసియా ఖండంలో శాంతి, స్థిరత నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.