ప్రజారోగ్యం కోసం రూ. 64 వేల కోట్లు ఖర్చు చేశాం

ప్రజారోగ్యం కోసం రూ. 64 వేల కోట్లు ఖర్చు చేశాం
ప్రజారోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 64 వేల కోట్లను ఖర్చు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. సోమవారం హర్యానా హిసార్‌లో జరిగిన మహారాజా అగ్రసేన్‌ మెడికల్‌ కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమిత్‌షా మోదీ ప్రభుత్వ విజయాలను ప్రస్తావించారు.  “గత పదేళ్లలో మోడీ ప్రభుత్వం 25 కోట్ల మందిని దారిద్య్రరేఖ నుంచి బయటకు తీసుకొచ్చింది. 20 కోట్ల మందికి ఆశ్రయం కల్పించడానికి నాలుగు కోట్ల ఇళ్లను నిర్మించాం. 81 కోట్ల మందికి నెలకు ఐదు కిలలో ఉచిత రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అందించింది” అని ఆయన పేర్కొన్నారు.
 
“2014 వరకు 12 కోట్ల కుటుంబాలకు టాయిలెట్‌ సౌకర్యాలు లేవు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి టాయిలెట్లు అందించిన రాష్ట్రంగా హర్యానా నిలిచింది. దానికి హర్యానా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. మోదీ  ప్రభుత్వం మౌలిక సదుపాయాల రంగంలో విశేష కృషి చేసింది. ప్రజారోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ కేంద్రాల కోసం రూ. 64 వేల కోట్లు ఖర్చు చేశాం” అని తెలిపారు. 
 
“గత పది సంవత్సరాల్లో 700కిపైగా ఇంటిగ్రేటెడ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్‌లు, 382 బ్లాక్‌ పబ్లిక్‌ హెల్త్‌ యూనిట్లు, 602 క్రిటికల్‌ కేర్‌ బాక్స్‌లు స్థాపించాము. నేడు దేశంలో 23 ఎయిమ్స్‌ ఆసుపత్రులు ఉన్నాయి. గతంలో వైద్య విద్యార్థులకు కేవలం 51 సీట్లు మాత్రమే ఉండేవి. నేడు వాటి సంఖ్యను 1,15,000కి పెంచాము. రాబోయే ఐదు సంవత్సరాల్లో మరో 85 వేల సీట్లను పెంచనున్నాం” అని అమిత్ షా వివరించారు. 

గతంలో హర్యానాలో కులతత్వం కారణంగా ఉద్యోగాలలో అవినీతి పెరిగిపోయి రాష్ట్ర పరువుపోయిందని,  కానీ బిజెపి ప్రభుత్వ హయాంలో 80 వేల ఉద్యోగాలు ఇచ్చి ప్రజాస్వామ్యంలో కులం ఆధారంగా రాజకీయాలు జరగవని నిరూపించిందని అమిత్‌షా తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి హయాంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ. 37 వేల కోట్లు ఉండేదని, అదే ఇప్పుడు నయాబ్‌ సింగ్‌ సైనీ నేతృత్వంలోని హర్యానాకు కేటాయించిన బడ్జెట్‌ రెండు లక్షల కోట్లకు పెరిగిందని అమిత్‌షా గుర్తు చేశారు.