బీజాపూర్ లో 50 మంది మావోయిస్టులు లొంగుబాటు

బీజాపూర్ లో 50 మంది మావోయిస్టులు లొంగుబాటు
 
మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇంతకుముందు ఎన్‌కౌంటర్లలో క్యాడర్‌ను కోల్పోయిన మావోయిస్టులు ఇప్పుడు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరిన్ని నష్టాలను ఎదుర్కొన్నారు. బీజాపూర్ జిల్లాలో 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 14 మంది తలలకు రూ. 68 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 
 
 లొంగుబాటు, మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర కుదుపు ఇవ్వనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  చత్తీస్‌గఢ్ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మావోయిస్టుల లొంగుబాటుతో అడవి ప్రాంతాల్లో శాంతి నెలకొనే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
 
 ఇందుకు సంబంధించిన వివరాలను బీజాపూర్‌ జిల్లా ఎస్పీ జితేంద్రయాదవ్‌ ఆదివారం వెల్లడించారు. బీజాపూర్‌ జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న ‘నియద్‌ నెల్లనార్‌’ కార్యక్రమానికి ఆకర్షితులైన మావోయిస్టులు లొంగిపోయేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఆపరేషన్లతో మావోయిస్టులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.వారు తమ పార్టీ సిద్ధాంతాలపైనా అసంతృప్తికి లోనై, ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు వస్తున్నారని తెలిపారు. లొంగిపోయిన వారిలో 14 మందిపై మొత్తం రూ.68 లక్షల రివార్డు ఉన్నట్టు ఆయన వెల్లడించారు. లొంగిపోయిన నక్సలైట్లలో మావోయిస్ట్‌ అగ్రనేత హిడ్మాకు అనుసంధానంగా ఉన్న బెటాలియన్లకు చెందిన వారున్నారని చెప్పారు. నక్సల్స్‌ లొంగుబాటును కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్వాగతించారు.

గతంలోనూ అనేక మంది మావోయిస్టులు ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా లొంగిపోయి సాధారణ జీవితాన్ని ఎంచుకున్నారు. గత ఏడాది ఆగస్టులో 25 మంది నక్సలైట్లు లొంగిపోయిన విషయం గమనార్హం.కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొన్ని గంటల్లో ఛత్తీస్‌గఢ్ పర్యటన చేయనున్న నేపథ్యంలో ఈ లొంగుబాటు జరగడం విశేషంగా మారింది. భద్రతా బలగాల వ్యూహాత్మక చర్యలు, ప్రభుత్వ పునరావాస విధానాలు మావోయిస్టు ప్రభావాన్ని తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు తీవ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న బీజాపూర్, దాంతేవాడ ప్రాంతాల్లో ఇలాంటి లొంగుబాట్లు జరుగడం శాంతి స్థాపనకు సహాయపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.