హెచ్‌సీయూలోకి బుల్డోజర్‌ తో విద్యార్ధులపై పోలీసుల దాడి

హెచ్‌సీయూలోకి బుల్డోజర్‌ తో విద్యార్ధులపై పోలీసుల దాడి

ఉగాది పండుగ పూట హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రణరంగంలా మారింది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో ఆదివారం వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్థులపై లాఠీ దెబ్బలతో విరుచుకుపడి దాదాపు 200 మందిని అరెస్ట్‌ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పండుగ రోజు కావడంతో విద్యార్థులెవరూ బయటకు రారని, తమకు అడ్డుచెప్పేవారు ఎవరూ ఉండరని గుట్టు చప్పుడు కాకుండా టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు జేసీబీలతో పోలీసుల కాపలా నడుమ వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లోకి వచ్చారు. 

దట్టమైన పొదలు, చెట్లను పెకిలించసాగారు. గమనించిన కొందరు విద్యార్థులు అక్కడికి చేరుకునేసరికి పోలీసులు చుట్టుముట్టారు. దొరికినోళ్లను దొరికినట్టే బంధించి వ్యాన్లలోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. ప్రతిఘటించిన వారిని లాఠీలతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తూ, జీవవైవిధ్యానికి నష్టం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని నినదిస్తూ అక్కడికి చేరకున్న విద్యార్థులపై పోలీసులు రెచ్చిపోయారు. 

కాళ్లు, చేతులు పట్టుకొని నేలపై ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు. అరెస్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని వర్సిటీలో పరిగెత్తిస్తూ మరీ లాఠీలతో చితకబాదారు. 200 మందికి పైగా విద్యార్థులను రాయదుర్గం, మాదాపూర్‌, గచ్చిబౌలి, కొల్లూరు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఠాణాలకు తరలించే క్రమంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని అడిగినందుకు హెల్మెట్లు, ప్రొటెక్షన్‌ షీల్డ్‌తో విచక్షణా రహితంగా కొట్టారు. కొందరు పోలీసులు తమను బూతులు తిట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.

పోలీసుల అరాచకాన్ని ప్రశ్నించిన ఆడపిల్లలను మహిళా పోలీసులు జుట్టుపట్టుకుని నేలపై ఈడ్చుకుంటూ వ్యాను ఎక్కించారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో విద్యార్థినులు గాయాలపాలయ్యారు. బట్టలు చిరిగిపోయినా పట్టించుకోకుండా విద్యార్థులను గుంజుకెళ్లారు. ఇతర రాష్ర్టాల వాళ్లు కావడంతో తెలుగు రాదని బూతులు తిడుతూ లాక్కెళ్లారు. గాయాలతో రక్తం కారుతున్నా పట్టించుకోకుండా వ్యాన్‌ ఎక్కించి ఠాణాలకు తరలించారు. 

అడ్డుకోబోయిన యువకులను కాళ్లు, చేతులు పట్టుకుని వ్యాన్‌లో పడేశారు. పక్కకు నిలబడ్డ కొందరు విద్యార్థులను అకారణంగా లాక్కెళ్లి వ్యాన్‌ ఎక్కించారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ తోటి విద్యార్థులు వర్సిటీ మెయిన్‌ గేట్‌ ఎదుట బైఠాయించారు. బయటకు రాకుండా నిర్బంధించడంతో అక్కడే కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. 400 ఎకరాల భూముల వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, అరెస్ట్‌ చేసిన విద్యార్థులను వదిలిపెట్టేదాకా అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.

“రేవంత్‌రెడ్డి నింయంతృత్వ పరిపాలనకు హెచ్‌సీయూ విద్యార్థులపై జరిగిన దాడి నిదర్శనం. 400 ఎకరాల భూములను లాక్కోవడానికి రేవంత్‌రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డుకుంటం. పండుగ రోజు ఎవరూ ఉండరనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కుట్రపూరితంగా మాపై దౌర్జన్యానికి పాల్పడ్డది. మమ్మల్ని దొంగల్లా, రౌడీల్లా ఈడ్చుకెళ్లారు. హాస్టళ్ల లోపలికి చొరబడి ఖైదీలను లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి అరెస్ట్‌ చేసిండ్రు. యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించడాన్ని ప్రశ్నించినందుకే మాపై దాడులకు పాల్పడ్డారు” అంటూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఉమేష్ అంబేద్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లిన ఎబివిపి 

హెచ్ సీయూ భూముల వేలం వేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. విద్యార్థులపై లాఠీఛార్జ్ ప్రయోగించిన పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు. హాస్టల్ రూముల్లోకి వెళ్లి విద్యార్థులపై విచక్షణారహితంగా పోలీసుల దాడి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని  కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకుని వెళ్లారు. 

పోలీసుల తీరుపై మండిపడిన బండి సంజయ్ విద్యార్థులపై లాఠీఛార్జీ అమానుషమని ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను తెగనమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా అని ప్రశ్నించారు. రాబోయే భావితరాలకు గజం స్థలం కూడా మిగలకుండా చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల ద్వారా భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సెంట్రల్ యూనివర్సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని మండిపడ్డారు.  భూముల రక్షణ కోసం పోరాడుతున్న విద్యార్థులపై దాడి చేయడం అమానుషం అని పేర్కొంటూ వెంటనే అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.