భూముల అమ్మకంపై హెచ్‌సీయూ విద్యార్థుల నిరసన

భూముల అమ్మకంపై హెచ్‌సీయూ విద్యార్థుల నిరసన
 
 యూనివర్సిటీ భూములను వేలం వేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) విద్యార్థులు శనివారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.  అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు హెచ్‌సీయూ విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్‌ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనాన్ని చేపట్టారు. 
 
యూనివర్సిటీ గేటు ముందు నుంచి విద్యార్థులను పోలీసులు లోపలికి నెట్టుకెళ్లారు.  విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో వర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయకుండా విద్యార్థిసంఘం నేతలను, విద్యార్థులను నెట్టివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ తోపులాటలో కొందరు విద్యార్థులు స్పృహ కోల్పోగా, మరికొందరికి గాయాలయ్యాయి. పోలీసుల ప్రయత్నాలను తిప్పికొడుతూ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
 
ఆగ్రహించిన విద్యార్థులు ‘పోలీస్‌ గో బ్యాక్‌’ నినాదాలతో హోరెత్తించారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌ రెడ్డి రాష్ర్టాన్ని దివాళా తీయడమే కాకుండా, దివాళా లోటును పూడ్చుకోవడానికి హెచ్‌సీ యూ భూములపై కన్నేశారని ఆరోపించారు.  
 
ఖజానా లోటును పూడ్చుకోవడానికి, ప్రైవేట్‌ వ్యక్తులకు హెచ్‌సీయూ భూములు కట్టబెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు400 ఎకరాల భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచే శారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్‌ రెడ్డి విద్యార్థులను గుంట నక్కలుగా అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండించారు. 
 
రేవంత్‌ రెడ్డి తన భాషను మార్చుకోవాలని, వెంటనే విద్యార్థిలోకానికి క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో రేవంత్‌ ఇంటిని ముట్టడించి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. మంత్రి శ్రీధర్‌ బాబు, సీఎం రేవంత్‌ రెడ్డి అబద్ధాలు చెప్తూ అసెంబ్లీని, మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 
 
శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులను చుట్టుముట్టి పోలీసులతో దాడులు చేయించారని మండిపడ్డారు. ఆడపిల్లలని చూడకుండా విద్యార్థినులను నెట్టివేశారని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులను దాటుకుని విద్యార్థులు ఐక్యతతో దిష్టిబొమ్మను దహనం చేశారు. హెచ్‌సీయూ భూములను వేలం వేయాలన్న నిర్ణయాన్ని రేవంత్‌ సర్కార్‌ ఉపసంహరించుకునే వరకూ పోరాటం సాగుతుందని విద్యార్ధి నేతలు స్పష్టం చేశారు.