సుక్మా జిల్లాలో 20 మంది మావోయిస్టులు మృతి

సుక్మా జిల్లాలో 20 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం జరిగిన భీకర పోరులో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. సుక్మా జిల్లా కెర్లపాల్ పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. 
 
దీంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ దళాలు శుక్రవారం రాత్రి కూంబింగ్ చేపట్టాయి. శనివారం తెల్లవారుజామున వారికి మావోలు తారసపడడంతో కాల్పులు మెుదలయ్యాయి. ప్రస్తుతం మావోలు ఉన్న ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. అలాగే చుట్టుపక్కల అటవీ ప్రాంతాన్ని ముమ్మర తనిఖీ చేస్తున్నారు.
 
ఇరు వర్గాల మధ్య విడతలవారీగా ఉదయం నుంచి కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల్లో డీవీసీఎం జగదీశ్‌ కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సుమారు 20 మృతదేహాలను స్వాదీనం చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తున్నది. భద్రతా బలగాల కాల్పుల్లో మరికొందరు మావోయిస్టులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.  ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతుండగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు శుక్రవారం తెల్లవారుజామున నారాయణపూర్ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్(ఐఈడీ) పేలి ఓ జవాన్ గాయపడ్డాడు.  ప్రస్తుతం సదరు జవాన్ నారాయణపూర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సుందర్‌రాజ్ తెలిపారు. బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లా అనేది మావోయిస్టు అత్యంత ప్రభావిత జిల్లాల్లో ఒకటిగా పేరొందింది. ఇప్పటికే అనేకసార్లు ఇక్కడ ఎదురుకాల్పులు జరిగాయి.

ఆపరేషన్ ‘కగార్’లో భాగంగా దండకారణ్యంలో మావోయిస్టుల వేట కొనసాగుతున్నది. ఇటీవల ఛత్తీస్‌గఢ్ జిల్లాల్లో జరిగిన పలు ఎన్‌కౌంటర్లను ఉద్దేశించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. 2026 మార్చి 31 నాటికి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఆపరేషన్ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా నక్షలిజాన్ని తుద ముట్టించడమే లక్ష్యంగా కేంద్రం వ్యూహాలు రచించినట్టు అవగతమవుతుంది. బస్తర్ రేంజ్ పరిధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు సుమారు 100కి పైగానే మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం సుకుమా జిల్లాలో కొనసాగుతున్న ఈ ఆపరేషన్లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.