
భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం అయ్యేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇందుకు టెక్నాలజీ వినియోగమే ఉత్తమ మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించిన నేపథ్యంలో గూగుల్‌తో ఒప్పందానికి టీటీడీ సిద్ధమవుతోంది. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్)ను ఉచితంగా అందించడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది.
వారం, పది రోజుల్లో టీటీడీ-గూగుల్ మధ్య అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదరనుంది. తర్వాత గూగుల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కసరత్తును పూర్తిచేస్తారు. ప్రయోగాత్మకంగా తిరుమలలో ఏఐని (కృత్రిమ మేధ) వాడతారు. ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులు చేయనున్నారు.
ప్రస్తుతం కొన్ని దేవస్థానాలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ వినియోగిస్తున్నా భక్తులకు సమాచారం అందించడానికే పరిమితమయ్యాయి. టీటీడీ ఇందుకు భిన్నంగా దర్శనాలతోపాటు వసతి, వివిధ సేవల కోసమూ గూగుల్ సాయం తీసుకోనుంది. ఏ సమయంలో, ఏ సీజన్‌లో ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు? అనే సమాచారమూ టీటీడీకి వస్తుంది.
తదనుగుణంగా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లను చేసుకోవచ్చు. దర్శన విధివిధానాలు, వస్త్రధారణ, స్థానికంగా అనుసరించాల్సిన నియమాల గురించి ఏఐ సాయంతో యాత్రికులూ తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దేశవిదేశాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో సౌలభ్యం కోసం వారి స్థానిక భాషల్లోనే సమాచారాన్ని అందించనున్నారు.
మరోవైపు గూగుల్ మ్యాప్‌ల సహాయంతో ఎప్పటికప్పుడు పలుచోట్ల రద్దీ గురించి భక్తులు సులభంగా తెలుసుకోవచ్చు. సామాన్యులు ఎక్కువగా గదుల కోసం వచ్చే కేంద్రీయ ఎంక్వైరీ ఆఫీస్(సీఆర్వో), హెల్త్ సెంటర్లు, అన్న ప్రసాద కేంద్రం, కల్యాణకట్ట వద్ద రద్దీ ఎలాఉందో ఎవరినీ అడగకుండా స్మార్ట్ ఫోన్ ద్వారానే సమాచారం రాబట్టవచ్చు.
ఫోన్‌లకే నోటిఫికేషన్లు వస్తాయి. ఈ సమాచారం టీటీడీకి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. క్యూ లైన్ల నియంత్రణ, షెడ్లలో ఎక్కువ సమయం భక్తులు నిరీక్షించకుండా ఉండేందుకూ తోడ్పడుతుంది. రద్దీ నియంత్రణ చర్యలు వేగంగా చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఏఐ కెమెరాలను తిరుమలలో గూగుల్ ఏర్పాటు చేయనుంది. తద్వారా అనుమానితులు, నిందితులైన వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నారా? అనే విషయాలు పోలీసులు, విజిలెన్స్ సిబ్బందికి తెలుస్తుంది. వారిపై నిఘా ఉంచుతారు. నిందితులకు సంబంధించిన ఫొటోలూ నిక్షిప్తంగా ఉంటాయి.
ఏఐ సాంకేతికత ద్వారా దళారులకూ అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా మోసపోయే భక్తుల సంఖ్య తగ్గుతుంది. గూగుల్ ఏఐ(కృత్రిమ మేధ) ప్రాజెక్టు విజయవంతమైతే ఒక్కో భక్తుడికి ఒక్కో ప్రత్యేక శాశ్వత ఐడీ వస్తుంది. భవిష్యత్తులో ఆ వ్యక్తి ఆ ఐడీ ద్వారానే దర్శనం, సేవలు, గదులను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎవరు ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు? ఎన్ని గదులు తీసుకున్నారు? అన్న సమస్త సమాచారమూ టీటీడీకి తెలుస్తుంది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఏ సమయంలోనైనా విన్నవించేందుకు అవకాశం ఏర్పడుతుంది. వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు అందించే అవకాశమూ ఉంది.
More Stories
ట్రంప్ వీసా రుసుం పెంపుపై భారత్ అత్యవసర నంబర్!
ఆర్థిక మాంద్యం ముప్పు దిశగా అమెరికా
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సత్తాతో సహా 25 పార్టీలపై వేటు