మయన్మార్‌లో 61 మంది మృతి.. వేయి పడకల ఆసుపత్రి ధ్వంసం

మయన్మార్‌లో 61 మంది మృతి.. వేయి పడకల ఆసుపత్రి ధ్వంసం

* బ్యాంకాక్‌లో భారతీయుల కోసం హెల్ప్‌లైన్‌

మయన్మార్‌ లో రిక్టరు స్కేలుపై 7.7, 6.4 తీవ్రతతో నిమిషాల వ్యవధిలోనే రెండు బలమైన ప్రకంపనలు నమోదైన విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. మయన్మార్‌ భూకంపం మృతుల సంఖ్య 61కి పెరిగింది. దాదాపు 250 మంది గాయపడ్డట్లు స్థానిక మీడియా నివేదించింది.

ఈ భూకంపం ధాటికి మయన్మార్‌ మొత్తం వణికిపోయింది. రోడ్లు, వంతెనలు, ఎయిర్‌పోర్ట్‌లు ధ్వంసమయ్యాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ భూకంపం తీవ్రతకు మయన్మార్‌ రాజధాని నేపిడాలో 1,000 పడకల ఆసుపత్రి ధ్వంసమైంది. ఇది నగరంలోనే అతిపెద్దదని స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనతో క్షతగాత్రులకు వీధుల్లోనే చికిత్స అందిస్తున్నారు. 

అత్యధికంగా క్షతగాత్రులు ఇక్కడే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కొత్తగా నిర్మించిన ఈ ఆసుపత్రికి ఇంకా పేరు పెట్టలేదు. ఈ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. థాయ్‌ల్యాండ్‌, మయన్మార్‌లో భారీగా ఆస్తినష్టం జరిగింది. మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.  మాండల్యా అనే ప్రదేశంలో మసీదు కూలి దాదాపు 20 మంది చనిపోగా టవుంగూలో పునరావాస కేంద్రం ధ్వంసమై మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మయన్మార్‌లోని సైనిక పాలకులు అంతర్జాతీయ సమాజం సాయం చేయాలని కోరారు.

 రంగంలోకి దిగిన ఆర్మీ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు విపత్తు నేపథ్యంలో మన్మార్‌లోని ఆరు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 

మరోవైపు థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనం పేకమేడలా కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా 90మంది గల్లంతైనట్లు ఆ దేశ రక్షణ మంత్రి వెల్లడించారు. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది ఏడుగురిని రక్షించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

విపత్తు నేపథ్యంలో బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ఈ మేరకు థాయ్‌లాండ్‌లోని భారతీయుల సహాయార్థం హెల్స్‌లైన్‌ ఏర్పాటు చేసింది. బాధితుల కోసం +66 618819218 నంబర్‌ను జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్‌ను సంప్రదించాలని సూచించింది. 

థాయ్‌ అధికారుల సమన్వయంతో దేశంలోని తాజా పరిస్థితిని ఇండియన్‌ ఎంబసీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. తాజా విపత్తులో ఏ భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయినట్లుగానీ, గాయపడినట్లు గానీ నివేదికలు లేవని వెల్లడించింది. అదేవిధంగా బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం, చియాంగ్‌ మాయిలోని కాన్పులేట్‌ సభ్యులందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది.