మయన్మార్‌, బ్యాంకాక్‌, చైనాలను వణికించిన భారీ భూకంపాలు

మయన్మార్‌, బ్యాంకాక్‌, చైనాలను వణికించిన భారీ భూకంపాలు

* క్లిష్ట పరిస్థితుల్లో అండగా ఉంటాం.. మోదీ ట్వీట్‌

వరుస ప్రకంపనలతో మయన్మార్‌ చిగురుటాకులా వణికింది. శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటల (స్థానిక కాలమానం) మధ్య రిక్టర్‌ స్కేలుపై 7.7, 6.8 తీవ్రతలతో భూమి కంపించింది. సాగింగ్‌ నగరానికి వాయువ్యంగా 16కి.మీ దూరంలో 10కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. 

మయన్మార్‌లో ఇప్పటి వరకు 20 మంది మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.  అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు మీడియా పేర్కొంది. సాగింగ్‌కు 24 కి.మీ దూరంలో ఉన్న మండలే నగరంలోని ఒక మసీదులో ప్రార్థనలు చేస్తుండగా పైకప్పు కుప్పకూలినట్లు మీడియా తెలిపింది.  సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార యంత్రాంగం హెచ్చరించింది.

మయన్మార్‌లో ఇరావడి నదిపై ఉన్న ఒక పాత వంతెన, నివాస భవనాలు కూలిపోయాయి. మండలేలోని విమానాశ్రయానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.  థాయ్‌లాండ్‌ సరిహద్దులో షాన్‌ రాష్ట్రంలోని టౌంగ్గీ నగరానికి సమీపంలో ఉన్న ఒక మఠం కూడా కూలిపోయినట్లు తెలిపారు. మయన్మార్‌లో జుంటా ప్రభుత్వం ‘అత్యవసర పరిస్థితి’ని ప్రకటించింది.

మరోవైపు థాయ్‌లాండ్‌లోనూ  ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. థాయ్‌లాండ్‌రాజధాని  బ్యాంకాక్‌లోని చతుచక్‌ పరిసరాల్లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది.  ఈ శిథిలాల కింద సుమారు 43 మంది కార్మికులు చిక్కుకున్నట్లు బ్యాంగ్‌ సూ జిల్లా డిప్యూటీ పోలీస్‌ చీఫ్‌ వొరాపత్‌ తెలిపారు. వందలాది మంది గాయపడ్డారని అంచనా వేస్తున్నామని, అయితే మృతుల సంఖ్య నిర్థారించలేమని తెలిపారు.  బ్యాంకాక్‌లో మెట్రో రైలు సేవలను నిలిపివేశారు.  

పరిస్థితిని సమీక్షించేందుకు థాయ్‌లాండ్‌ ప్రధాని పెటోంగ్‌టార్న షినవత్రా అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాంకాక్‌లో సైతం ‘అత్యవసర పరిస్థితి’ని ప్రకటించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.  బ్యాంకాక్‌తో పాటు మరికొన్ని నగరాల్లో భవనాలు కంపించడం, ప్రజలు భయంతో వీధుల్లోకి పరిగెత్తుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రకంపనల ధాటికి ఒక ప్రైవేట్‌ భవనానికి చెందిన స్విమ్మింగ్‌ పూల్‌లో నీరు చిమ్మడంతో మినీ సునామీ మాదిరిగా కనిపించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.

చైనాలోని యువాన్‌ ప్రావిన్స్‌లో కూడా బలమైన ప్రకంపనలు వచ్చినట్లు చైనా భూకంప నెట్‌వర్క్‌ పేర్కొంది. భారత్‌లోని పశ్చిమబెంగాల్‌, కోల్‌కతా, మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్‌లోని ఢాకా, చటోగ్రామ్‌లలో కూడా స్వల్పప్రకంపనలు సంభవించాయని మీడియా తెలిపింది.

తాజా విపత్తుపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు విచారం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆయా దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మోదీ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ పెట్టారు.

“మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో భూకంపం పరిస్థితిపై ఆందోళనగా ఉంది. అక్కడి ప్రజలందరి భద్రత, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నా. అవసరమైన సాయం అందించేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది. సహాయక చర్యలపై మయన్మార్‌, థాయ్‌లాండ్‌ దేశాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని కేంద్ర విదేశాంగ శాఖను కోరాను” అని ప్రధాని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.