గోదావరి పుష్కరాల కోసం ముందస్తు ఏర్పాట్లు

గోదావరి పుష్కరాల కోసం ముందస్తు ఏర్పాట్లు
గోదావరి పుష్కరాల కోసం ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాట్ల పర్యవేక్షణకు ఇద్దరు ఐఎఎస్ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. ప్రత్యేక అధికారిగా జీ.వీరపాండియన్, అదనపు ప్రత్యేక అధికారిగా విజయరామరాజు నియమిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ అభివృద్ధితో పరుగులు పెట్టాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కలెక్టర్ల సదస్సులో రెండో రోజు జోన్ల వారీగా జిల్లాల యాక్షన్ ప్లాన్​పై కలెక్టర్లు ప్రజెంటేషన్ ఇచ్చారు. 

ఆయా జిల్లాల్లోని సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అన్ని ప్రాంతాల్లోనూ ప్రజల జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయం పెరిగేలా చూడాలన్న సీఎం పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నించాలని సూచించారు కొత్త జిల్లాల్లో జిల్లా స్థాయి అధికారులకు పూర్తిస్థాయి అధికారాలు కల్పించాలని ఆదేశించారు.

\రాష్ట్రంలో ప్రతి జిల్లాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని దీనికి కలెక్టర్ల సహకారం ఎంతో అవసరమని సీఎం చంద్రబాబు చెప్పారు. జిల్లాల్లోని వనరులను వినియోగించుకుంటూ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలోనూ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసే దిశగా చొరవ చూపాలని కోరారు. 

పర్యాటకానికి పెద్దపీట వేయాలని ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పర్యటకాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. కాస్మోపాలిటిన్ సిటీగా వృద్ధి చెందుతున్న విశాఖలో కనీసం 5000 హోటల్ గదులు అందుబాటులో ఉండాలని చెప్పారు. మొండి బకాయిల వసూళ్లలో అవసరమైతే కలెక్టర్లు సంబంధిత శాఖలకు సహకరించాలని, ఈ విషయంలో కఠింసగా వ్యవహరించాలని సిఎం సూచించినట్లు తెలిపింది.

అదే విధంగా వృత్తి పన్నును పెంచాలన్న ప్రతి పాదనల నేపథ్యంలో జిల్లాలలో కూడా దీనిపై దృష్టి సారించాలని చెప్పినట్లు సమాచారం.  ఆస్తి పన్ను వసూళ్లను కూడా సీరియస్ గా తీసుకోవాలని, అవసరమైతే చర్యలకు ఉపక్రమిం చాలని కూడా కలెక్టర్లకు సిఎం సూచించినట్లు తెలిసింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, వ్యక్తుల నుంచి జిఎస్టి బకాయిలు పెరుగుతున్నాయని, వాటిని పూర్తిగా వసూలు చేసేందుకు కూడా సహకరించాలని కోరారు. 

జిల్లాలో పలు హోటళు రెస్టారెంట్లు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోకుండా నడుస్తున్నాయని, వాటిని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకునేలా చూడాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గనులకు అనుమతులు, నిబంధనలను అతిక్రమించి తవ్వకాలు జరుపుతుం డడం, ఇసుక తవ్వకాల్లో డీసిల్టేషన్ విధానం వంటి వాటిని కూడా సక్రమంగా అమలు చేసి ఆదాయానికి గండి పడకుండా చూడాలని భావిస్తున్నారు.

ఆదాయానికి ఏఐ జిల్లాల్లో ఆదాయం తగ్గకుండా చూసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సు వినియోగించుకునే అంశం కూడా చర్చకు వచ్చింది. ఎక్కడ నుంచి ఎంత ఆదాయం రావాల్సి ఉంటుంది, ఎంత వస్తోందన్నది కూడా ఏఐ సహకారంతో గుర్తించవచ్చునని, అందుకే ఈ విధానంపైనా దృష్టి సారించాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.