నల్ల సముద్రంలో దాడుల విరమణకు రష్యా, ఉక్రెయిన్ అంగీకారం

నల్ల సముద్రంలో దాడుల విరమణకు రష్యా, ఉక్రెయిన్ అంగీకారం

ఉక్రెయిన్‌లో పరిమిత కాల్పుల విరమణపై రష్యా, అమెరికా ప్రతినిధుల మధ్య చర్చలు ముగిశాయి. సౌదీ అరేబియాలో 12 గంటల పాటు జరిగిన చర్చల తర్వాత ముగిసిందని రష్యా మీడియా తెలిపింది. నల్ల సముద్రంలో షిప్పింగ్‌ భద్రతపై దృష్టి సారించాయని, ఈ అంశంపై కొత్త ఒప్పందం సాధ్యమేననిరష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ తెలిపారు. 

చర్చలు ముగిసిన అనంతరం మంగళవారం సెర్గీ లావోస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఆ కొత్త ఒప్పందం కఠినమైన షరతులను కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆయుధాల సరఫరా కోసం ఖాళీ ఓడలను వినియోగించకుండా రష్యా తనిఖీ చేపట్టాలనుకుంటుందని తెలిపారు. రష్యా నుండి ధాన్యం, ఎరువుల ఎగుమతికి వివిధ అడ్డంకులు గతంలో తీవ్రమైన సమస్యగా ఉన్నాయని కూడా సెర్గీ వెల్లడించారు.

కాగా, నల్ల సముద్రంలో నౌకలపై సైనిక దాడులను నివారించడానికి రష్యా మరియు ఉక్రెయిన్ విడివిడిగా అంగీకరించాయని సౌదీ అరేబియాలో చర్చల తర్వాత అమెరికా ప్రకటించింది. సమాంతర ప్రకటనలలో, వైట్ హౌస్ ప్రతి దేశం “సురక్షిత నావిగేషన్‌ను నిర్ధారించడానికి, బలప్రయోగాన్ని తొలగించడానికి, నల్ల సముద్రంలో సైనిక ప్రయోజనాల కోసం వాణిజ్య నౌకలను ఉపయోగించడాన్ని నిరోధించడానికి అంగీకరించింది” అని తెలిపింది.

ఉక్రెయిన్‌ చర్చల బృందం అమెరికా ప్రతినిధులతో భేటీ అయ్యేందుకు మరో రోజు రియాద్‌లోనే ఉండనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండవ సమావేశం జరిగే అవకాశం ఉందని, చర్చల్లో పురోగతి సాధించవచ్చని పేర్కొన్నాయి. 12 గంటలకు పైగా చర్చల తర్వాత అమెరికా ప్రతినిధులతో భేటీ ముగిసిందని, త్వరలో సంయుక్త ప్రకటన వెలువడనుందని రష్యా ప్రభుత్వ మీడియా టిఎఎస్‌ఎస్‌ పేర్కొంది.

తాజాగా దాడులు జరిగినట్లు ఇరు దేశాలు నివేదించినట్లు రష్యా మీడియా  పేర్కొంది.  రియాద్‌లోని ఒక  హోటల్‌లో చర్చలు జరుగుతుండగా, ఈశాన్య ఉక్రెయిన్‌లోని సుమీపై సోమవారం జరిగిన క్షిపణి దాడుల్లో 17 మంది పిల్లలు సహా సుమారు 90 మంది గాయపడ్డారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. 

నివాస ప్రాంతంపై జరిగిన దాడిలో అపార్ట్‌మెంట్లు,  విద్యా భవనాలు దెబ్బతిన్నాయని ప్రాంతీయ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం తెలిపింది. ఆస్పత్రి కూడా ప్రభావితమైనట్లు నగర తాత్కాలిక మేయర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లోని ప్రత్యేక సైనిక ఆపరేషన్‌ జోన్‌లో ఒక కారు పై దాడి జరిగిందని, ఈ ఘటనలో ఇద్దరు జర్నలిస్టులు సహా డ్రైవర్‌ మరణించినట్లు రష్యా ప్రకటించింది.