
ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంలో రూ.4 వేల కోట్లు బినామీ లావాదేవీల ద్వారా దుబాయ్, ఆఫ్రికా దేశాలకు తరలించినట్లు ఆరోపిస్తూ ఈ కుంభకోణంపై ఈడీ చేత కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని న టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు.
లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లుపై సోమవారం జరిగిన చర్చలో పాల్గొంటూ మొత్తం రూ.99 వేల కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగితే రూ.650 కోట్లు మాత్రమే నగదు రహిత లావాదేవీలు జరిగాయని తెలిపారు. ఇందులో రూ.18 వేల కోట్లు దుర్వినియోగమైనట్లు ఆరోపించారు. మరో రూ.4000ల కోట్లను బినామీల పేరుమీద దుబాయ్, ఆఫ్రికాలకు తరలించినట్లు ఆరోపించారు.
ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఓ మౌలిక వసతుల కంపెనీ పేరుతో ఎన్. సునీల్‌రెడ్డి అనే వ్యక్తి రూ.2 వేల కోట్లు దుబాయ్‌కి తరలించారని ధ్వజమెత్తారు. మరో వెయ్యి కోట్లు ఆఫ్రికా దేశాలకు తరలించారని తెలిపారు. సినిమాలకు ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఉన్నట్లే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలోనూ అదే శైలి కొనసాగిందని ఆయన వివరించారు. ఏపీలో లిక్కర్ స్కాం వల్లే రాజ్యసభలో ఓ ఎంపీకి నాలుగేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ రాజీనామా చేశారని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
“ప్రొడక్షన్ స్థాయిలో ఏపీలో ఉన్న మొత్తం 20 నుంచి 25 డిస్టిలరీలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. 26 కొత్త కంపెనీలను ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా వినిపించని, కనిపించని కొత్త బ్రాండ్లను తయారుచేయించారు. నూతన బ్రాండ్లను తయారు చేయగానే వాటిని ఎలా పంపిణీ చేశారో తెలుసా? కొత్త బ్రాండ్లను ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఇచ్చారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే దుకాణాల్లో విక్రయించారు. అన్ని నగదు లావాదేవీలే చేశారు” అని లావు ఆరోపించారు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు రూ.1700 కోట్ల నుంచి రూ.2000ల కోట్ల వరకు వసూలు చేశాయన్న ఆయన ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదు సంవత్సరాల్లో లిక్కర్ పేరిట అంతకుమించి వసూళ్లు జరిగాయని తెలిపారు.
More Stories
విశాఖ సముద్ర తీర కోత నివారణకు కేంద్రం రూ 222 కోట్లు
ప్రముఖ నవలా రచయిత ’లల్లాదేవి’ కన్నుమూత
ఉగ్రవాదుల బాంబు బెదిరింపులతో ఉలిక్కిపడ్డ తిరుపతి