
విశిష్ట గుర్తింపు సంఖ్య గల కార్డు ఆధార్‌తో వోటర్ కార్డు అనుసంధానానికి ఎన్నికల కమిషన్ (ఇసి) మొగ్గు చూపింది. ప్రస్తుత చట్టం, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఆధార్‌తో వోటర్ కార్డును అనుసంధానిస్తామని ఇసి మంగళవారం ప్రకటించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి మంగళవారం ఈ విషయమై కీలక భేటీ జరిపారు. ఈ భేటీలోనే ఓటర్ ఐడీ, ఆధార్ అనుసంధానంపై చర్చించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఈసీలు డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషీ న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, యూఐడీఏఐ సీఈవో, ఎన్నికల కమిషన్ సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించారు.
కాగా, ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆధార్‌తో ఓటరు ఐడీలను అనుసంధానిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలపై త్వరలోనే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ), ఈసీలకు చెందిన నిపుణులు సంప్రదింపులు జరుపుతారని ఎన్నికల సంఘం తెలిపింది.
“రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఓటు హక్కు భారత పౌరులకు మాత్రమే ఉంది. ఒక వ్యక్తి ఉనికిని నిర్ధరించడానికి ఆధార్ ప్రాతిపదికగా నిలుస్తుంది. అందుకే మేం ఓటరు ఐడీని ఆధార్‌తో లింక్ చేస్తున్నాం. 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 23(4), 23(5), 23(6) సెక్షన్ల ప్రకారం, 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే మేం ఈ ప్రక్రియను చేపడుతున్నాం” అని ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇటీవల నకిలీ ఓటర్ కార్డ్ విషయంలో పార్లమెంట్‌తో పాటు బయట గందరగోళం నెలకొన్నది. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇటీవల ఎన్నికల సంఘం దశాబ్దాల నాటి డూప్లికేట్ ఓటరు ఐడీ నెంబర్స్ సమస్యను రాబోయే మూడు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.
ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటరు ఐడీతో ఆధార్ కార్డును లింక్ చేసుకోవచ్చు. ఆధార్-ఓటర్ ఐడీల అనుసంధానాన్ని పూర్తి చేయడానికి నిర్దిష్ట గడువేదీ లేదని ఇప్పటికే పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యం మాత్రమే తమకు ఉందని పేర్కొంది. ఓటరు ఐడీతో ఆధార్‌ను లింక్ చేసుకోని వారి పేర్లను ఓటరు జాబితాల నుంచి తొలగించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది.
ప్రజా ప్రాతినిధ్య చట్టం -1950లోని సెక్షన్ 23ని 2021 ఎన్నికల చట్టాల సవరణ చట్టం ద్వారా సవరించారు. దీని ప్రకారం, “ఒక భారత పౌరుడి ఓటరు గుర్తింపును నిర్ధరించేందుకు, ఆధార్ కార్డును స్వచ్ఛందంగా చూపించమని అతడిని అడిగే అధికారం ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులకు ఉంటుంది”.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు