క‌ర్నాట‌క‌లో ఇజ్రాయిలీ టూరిస్టుపై సామూహిక అత్యాచారం

క‌ర్నాట‌క‌లో ఇజ్రాయిలీ టూరిస్టుపై సామూహిక అత్యాచారం
క‌ర్నాట‌క‌లో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌పై సామూహిక అత్యాచారం జ‌రిగింది. 27 ఏళ్ల‌ ఇజ్రాయిల్ ప‌ర్యాట‌కుల‌రాలితో పాటు ఓ హోమ్‌స్టే ఓన‌ర్‌పై గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డ్డారు. కొప్పాల్‌లో ఉన్న తుంగ‌భ‌ద్ర కెనాల్ వ‌ద్ద గురువారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దాడికి పాల్ప‌డ్డ నిందితులు మ‌హిళ‌ల‌తో క‌లిసి ఉన్న మ‌రో ముగ్గుర్ని కాలువ‌లోకి తోసివేశారు. 
 
అమెరికాకు చెందిన డేనియ‌ల్‌, మ‌హారాష్ట్ర ప‌ర్యాట‌కుడు పంక‌జ్‌లు కాలువ నుంచి ప్రాణాల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే ఒడిశాకు చెందిన బిబాష్ అనే వ్య‌క్తి ఆచూకీ లేదు. నిందితుల్ని త్వ‌ర‌లో అరెస్టు చేయనున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. సామూహిక అత్యాచారానికి గురైన ఇద్ద‌రు మ‌హిళ‌లు ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

డిన్న‌ర్ చేసి తుంగ‌భ‌ద్ర లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ వ‌ద్ద విహారానికి వెళ్లిన స‌మ‌యంలో బైక్‌పై వ‌చ్చిన వ్య‌క్తులు త‌మ‌పై దాడి చేసిన‌ట్లు హోమ్‌స్టే ఓన‌ర్ త‌న ఫిర్యాదులో పేర్కొన్న‌ది. పెట్రోల్ ఎక్క‌డ దొరుకుతుంద‌ని అడిగార‌ని, ఆ త‌ర్వాత డ‌బ్బులు డిమాండ్ చేశార‌ని చెప్పింది.  డ‌బ్బులు ఇచ్చేందుకు నిరాక‌రించ‌డంతో, వాళ్లు ప‌ర్యాట‌కుల‌పై దాడి చేశార‌ని, మ‌హిళ‌ల్ని రేప్ చేసిన‌ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నేరానికి పాల్ప‌డిన త‌ర్వాత బైక్‌పై పారిపోయిన‌ట్లు చెప్పారు. ప‌ర్యాట‌కుల్లో ఇద్ద‌రు విదేశీయులు ఉన్నార‌ని, దాంట్లో ఓ ఇజ్రాయిలీ మ‌హిళ ఉన్న‌ట్లు కొప్పాల్ ఎస్సీ రామ్ అర‌సిద్ది తెలిపారు.

అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసు డాగ్ స్వ్కాడ్‌ మిస్సింగ్ టూరిస్టు గురించి వెతుకుతున్నారు. అత్యాచారానికి గురైన మ‌హిళ‌లు ఆస్ప‌త్రిలో కోలుకుంటున్నారు. వాళ్ల‌ను ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌నున్న‌ట్లు పోలీసులు తెలిపారు. మ‌హిళ‌లు ఇచ్చిన ఫిర్యాదు ధారంగా రేప్, గ్యాంగ్ రేప్, దొంగ‌త‌నం కేసు నమోదు చేశారు. నిందితుల్ని గుర్తించామ‌ని, రెండు స్పెష‌ల్ టీమ్స్ ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్లు తెలిపారు.