
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు పరమహంస యోగానంద మహాసమాధి ఆరాధనోత్సవాలను దేశవ్యాప్తంగా భక్తి ప్రపత్తులతో జరుపుకుంటున్నారు. హైదరాబాద్ బేగంపేట చికోటి గార్డెన్స్ లోని యోగదా సత్సంగ ధ్యాన కేంద్రంలో భక్తులు ప్రత్యేక ధ్యానం, భజనల్లో పాల్గొన్నారు.
పరమహంస యోగానంద చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మకథ తదితర పుస్తకాలనుంచి కొన్ని మధుర ఘట్టాలను భక్తులకు చదివి వినిపించారు. ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు వైఎస్ఎస్ గురుపరంపరలో ఒకరైన స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి మహాసమాధి ఆరాధన ఉత్సవాలు బేగంపేట ధ్యానకేంద్రంలో జరుగుతాయని వైఎస్ఎస్ కార్యదర్శి శశివదనా రెడ్డి తెలిపారు.
దైవసాక్షాత్కారం పొందిన గురువు మరణసమయంలో తన శరీరాన్ని సస్పృహతో విడిచిపెట్టడాన్ని మహా సమాధి అంటారు. శ్రీయుక్తేశ్వర్ గిరి 1936, మార్చి 9న మహాసమాధి చెందితే, ప్రపంచఖ్యాతి పొందిన ఆయన శిష్యులు పరమహంస యోగానంద 1952, మార్చి 7న మహాసమాధి చెందారు. క్రియాయోగ పరంపరకు చెందిన ఈ ఇరువురు గురువులూ తమ శరీరాలను, అంతవరకూ తమతో కలిసి జీవించిన ఒక వస్త్రాన్ని త్యజించినట్టుగా, వదిలిపెట్టారు; తడవకు ఒక అతిదీర్ఘ క్రియా శ్వాసతో, వారి శిష్యులను మోక్షం వైపు నడిపిస్తూ, జీవించారు.
“ఒక యోగి ఆత్మకథ” పుస్తకంలో వర్ణించినట్టుగా క్రియాయోగం ప్రతిశ్వాసతోనూ రక్తప్రవాహాన్ని కర్బనరహితం చేస్తూ తద్ద్వారా శరీరకణాల నశింపును అంతకంతకూ తగ్గిస్తూ చివరకు నివారిస్తుంది. తద్ద్వారా పోగైన అదనపు ఆక్సిజన్ పరమాణువులు కణాల్ని స్వచ్ఛమైన శక్తిగా మారుస్తాయి. ఆ విధంగా 30 సెకండ్లపాటు చేసే ఒక క్రియాశ్వాస ఒక ఏడాదిలో సహజ రీతిలో జరిగే ఆధ్యాత్మికాభివృద్ధిని వ్యక్తిలో కలిగిస్తుంది.
ఇది శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన ఒక ప్రాచీన విజ్ఞానం. ఆ తరువాతికాలంలో అది పతంజలికి, మరికొందరు శిష్యులకూ తెలిసింది. ఈ యుగంలో మహావతార బాబాజీ లాహిరీ మహాశయులకు ఇవ్వగా, ఆయన యోగానందుల గురువైన శ్రీయుక్తేశ్వర్ కు ఉపదేశించారు.
యోగానంద తన మాటల్లోనే చేసిన వాగ్దానం ప్రకారం ఆయన మహాసమాధి చెంది 73 ఏళ్ళు గడచినా, గృహ అధ్యయనం కోసం రూపొందించిన ఆత్మసాక్షాత్కార సాధనా పాఠాల ద్వారా శ్రద్ధాళువులైన తన శిష్యులకు క్రియాయోగాన్ని నేర్పిస్తూనే ఉన్నారు. ఆంతరిక ఆధ్యాత్మిక సహాయాన్ని నిజంగా అన్వేషిస్తూ యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకి వచ్చిన వారందరూ వారు కోరుకునేది భగవంతుడి నుంచి తప్పక పొందుతారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత