2050కల్లా 44 కోట్ల మందికి ఊబకాయం

2050కల్లా 44 కోట్ల మందికి ఊబకాయం

జీవనశైలి కారణంగా వచ్చే వ్యాధులు మన ఆరోగ్యానికి పెను ముప్పుగా పరిణమిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందులో ఊబకాయం ఒకటని, అనేక జబ్బులకు ఇదే మూలకారణమని చెప్పారు. ఇటీవల విడుదలైన ఒక సర్వే ప్రకారం మన దేశంలో 2050 నాటికి 44 కోట్ల మంది ప్రజలు ఊబకాయ సమస్య బారిన పడే అవకాశం ఉందని మోదీ తెలిపారు. 

శుక్రవారం ఆయన కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్‌ హవేలీలోని సిల్వస పట్టణంలో రూ.2,587 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం సిల్వాసాలో ఒక ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు.

 ఊబకాయం ప్రమాదం దిగ్భ్రాంతికర, ప్రమాదకర సంఖ్య అని పేర్కొంటూ ఊబకాయం సమస్యను అధిగమించేందుకు వంట నూనె వాడకాన్ని పది శాతం మేర తగ్గించాలని ప్రధాని మరోసారి పిలుపు ఇచ్చారు. సకాలంలో చర్య తీసుకోని పక్షంలో భవిష్యత్తులో భారీ స్థాయిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆయన హెచ్చరించారు. ఊబకాయం బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలని చెబుతూ బరువు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. అందరూ 10 శాతం తక్కువగా వంట నూనెలను కొనుగోలు చేస్తామని ప్రతినబూనాలని కోరారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం, సైక్లింగ్‌ చేయాలని చెప్పారు. ప్రతి మూడవ వ్యక్తి ఊబకాయం కారణంగా తీవ్ర రుగ్మతలతో బాధపడవచ్చునని ఆయన హెచ్చరించారు. 

ప్రజలకు సరసమైన ధరల్లో, నాణ్యమైన జనరిక్ మందులు సమకూర్చడానికి కేంద్రం దేశవ్యాప్తంగా 25 వేల జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయగలదని ప్రధాని ప్రకటించారు.  కాగా, సింగపూర్ ఒకప్పుడు కొద్ది మంది మత్సకారులు నివసించిన దీవి అని, కానీ, తన పౌరుల కఠిన శ్రమ కారణంగా స్వల్ప కాలంలోనే అభివృద్ధి చెందిన దేశంగా మారిందని మోదీ సభికులతో చెప్పారు. 

దాద్రానగర్ హవేలి, దామనఖ డయ్యూ కూడా అదే విధంగా మారవచ్చునని సూచించారు. కేంద్రపాలిత ప్రాంత ప్రజలు ఆ మార్పు తీసుకురాగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ కృషిలో వారికి దన్నుగా నిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని ప్రకటించారు. ‘దాద్రా నగర్ హవేలి, దామన్ డయ్యూ మనకు కేవలం కేంద్రపాలిత ప్రాంతంకాదు, కానీ మనకు గర్వకారణం, వారసత్వ సంపద. అది విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందింది’ అని ఆయన పేర్కొన్నారు.