
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు స్మారక కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో స్మారకానికి ప్రతిపాదిత ప్రదేశానికి మన్మోహన్ సింగ్ కుటుంబం ఆమోదం తెలియజేసింది. ప్రతిపాదిత ప్రదేశాన్ని తాము ఆమోదించామని, అంగీకార పత్రాన్ని పంపుతున్నామని ఆయన కుటుంబం కేంద్ర గృహనిర్మాణ, పట్టణ అభివృద్ధి మంత్రిత్వశాఖకు లేఖ రాసినట్లు ఆయన కుటుంబ సన్నిహిత వర్గాలు తెలియజేశాయి.
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి కూడా అయిన మన్మోహన్ సింగ్ ముగ్గురు కుమార్తెలు, వారి భర్తలు ప్రతిపాదిత స్మారక కేంద్ర ప్రదేశాన్ని ఇంతకుముందు సందర్శించారు. సుమారు 900 చదరపు మీటర్ల విస్తీర్ణం గల ఆ ప్రదేశం రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ఉన్నది. ఆ స్మృతి స్థల్‌లోనే మాజీ ప్రధానులు, రాష్ట్రపతుల స్మారక చిహ్నాలను ఏర్పాటు చేశారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారక చిహ్నం మన్మోహన్ సింగ్ కోసం ప్రతిపాదించిన ప్రదేశం పక్కనే ఉన్నది. మన్మోహన్ సింగ్ స్మృత్యర్థం ఏర్పాటు చేయనున్న ఒక ట్రస్ట్ పేరిట భూమి బదలీ ప్రక్రియ నిర్వర్తించాల్సి ఉంది.
త్వరలో ఏర్పాటు కానున్న ఆ ట్రస్ట్ సభ్యుల పేర్లను ఆయన కుటుంబం ప్రతిపాదించి, ఖరారు చేయవలసి ఉందని ఆ వర్గాలు తెలియజేశాయి. ట్రస్ట్ ఏర్పాటు కాగానే ప్రభుత్వం స్మారక చిహ్నం నిర్మాణానికి రూ. 25 లక్షల గ్రాంట్‌ను బదలీ చేస్తుందని ఆ వర్గాలు తెలిపాయి. కేంద్ర పబ్లిక్ వర్క్ శాఖ అధికారులు ఇప్పటికే ఆ ప్రదేశాన్ని సందర్శించారు.
కాగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం కర్ణాటక రాజధాని బెంగళూరులోని బెంగళూరు సెంట్రల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా అసెంబ్లీలో శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2024 డిసెంబర్ 26న తుది శ్వాస విడిచారు.
ఆయన మరణం తర్వాత దేశంలో ఒక యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం ఇదే తొలిసారి. బెంగళూరు సెంట్రల్ యూనివర్సిటీని 2017లో స్థాపించారు. 2024లో తన 92వ ఏట కన్ను మూసిన మన్మోహన్ సింగ్‌ను ఆధునిక ఆర్థిక సంస్కరణల రూపకర్తగా కీర్తిని సంపాదించారు. భారతదేశానికి ఆయన 13వ ప్రధానిగా పనిచేశారు. ఆయన 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా కొనసాగారు.
More Stories
ఆఫ్ఘన్ భూభాగాన్ని మరో దేశంకు వ్యతిరేకంగా అనుమతించం!
ఐపీఎస్ ఆత్మహత్యలో హర్యానా డీజీపీ, ఎస్పీలపై కేసు
కేరళలో ముగ్గురు యుడిఎఫ్ ఎమ్మెల్యేల సైస్పెన్షన్