
* ఐఐటీ హైదరాబాద్ తో ఒప్పందం కుదుర్చుకున్న బొగ్గు, గనుల శాఖ
ఐఐటీ హైదరాబాద్‌లో రూ.98 కోట్లతో సెంటర్ ఆఫ్ క్లీన్ కోల్ ఎనర్జీ & నెట్ జీరో (క్లీన్ జెడ్) పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కోలిండియా, ఐఐటీ (హైదరాబాద్)ల మధ్య కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం ఒప్పందం జరిగింది. బొగ్గు రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి పరిశోధనలకు పెద్దపీట వేసేందుకు, సెంట్రల్ మైన్ ప్లానింగ్ & డిజైన్ ఇనిస్టిట్యూట్ లిమిటెడ్ (సిఎంపిడిఐ) కింద స్వతంత్ర పరిశోధన, అభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆలోచన.
ఈ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో బొగ్గు ప్రాధాన్యత పెరుగుతూ వస్తోందని, అన్ని రంగాల్లో, భారత దేశ అభివృద్ధిలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. 72 శాతం విద్యుత్ మన దేశంలో బొగ్గు ద్వారానే ఉత్పత్తి చేసుకుంటున్నామని చెప్పారు స్టీలు, సిమెంట్, అల్యూమినియం, పేపర్, టెక్స్ టైల్, హెవీ ఇండస్ర్టీ రంగాల్లో బొగ్గు కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.
బొగ్గు ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని పేర్కొంటూ బొగ్గు వినియోగంలో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉందని, బొగ్గు నిల్వల విషయానికొస్తే 5వ స్థానంలో ఉందని తెలిపారు. కోలిండియా ప్రపంచంలోనే నంబర్ వన్ కంపెనీ అని పేర్కొంటూ బొగ్గు ఉత్పత్తి ద్వారా అనేక రాష్ట్రాల్లో రెవెన్యూ అందజేస్తున్నమని చెప్పారు.
రైల్వే శాఖలో బొగ్గు రవాణా ద్వారా 50 శాతం ఆదాయం సమకూరుతోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. క్లీన్ కోల్ ఎనర్జీ, నెట్ జీరో కర్బన ఉద్గారాలు లక్ష్యంగా సరికొత్త సాంకేతికత అభివృద్ధి చేసేందుకు సెంట్రల్ మైన్ ప్లానింగ్ డిజైన్ ఇన్ స్టిట్యూట్ ద్వారా పరిశోధన పెంచాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇందులో భాగంగా నేషనల్ సెంటర్ ఫర్ కోల్ అండ్ ఎనర్జీ రీసెర్చ్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
దేశంలోని ఐఐటీలతో కలిసి ఈ సెంటర్ పనిచేస్తుందని చెబుతూ ఇందులో భాగంగా క్లీన్ కోల్ ఎనర్జీ, నెట్ జీరో పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఐఐటీ హైదరాబాద్ స్థాపిస్తునట్లు వెల్లడించారు. క్లీన్ కోల్ టెక్నాలజీ, బొగ్గు వినియోగంలో ఆధునిక సాంకేతిక అభివృద్ధి చేసే విషయంలో ఐఐటీ హైదరాబాద్ తో ఎంఓయూ చేసుకున్నామని వివరించారు.
నెట్ జీరో లక్ష్యాలను చేరుకునేందుకు కటింగ్ ఎడ్జ్ సాంకేతికతలను అభివృద్ధి చేయడం, సుస్థిరంగా బొగ్గును ఎలా వినియోగించుకోవాలనే దానిపై ఐఐటీ పనిచేస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలకు క్రిటికల్ మినరల్స్ అవసరం ఉందని చెబుతూ క్రిటికల్ మినరల్స్ ను గుర్తించేందుకు ఐఐటీ హైదరాబాద్ కూడా సాంకేతిక సాయం అందజేస్తుందని చెప్పారు. కోలిండియా ఉద్యోగులకు కూడా సమీప భవిష్యత్తులో ఐఐటీ హైదరాబాద్ లో శిక్షణ అందించాలని చూస్తున్నామని తెలిపారు.
More Stories
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు
పంటలకు జీవ ఉత్ప్రేరకాలఅమ్మకంపై నిషేధం
ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్