
యూఏఈలో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష పడింది. వేర్వేరు హత్య కేసుల్లో దోషులుగా తేలడంతో ఇద్దరు వ్యక్తులకు ఉరిశిక్ష అమలు చేశారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిందితులు కేరళకు చెందిన మహమ్మద్ రినాష్ అరంగిలోట్టు, మురళీధరన్ పెరుమ్‌తట్ట వలప్పిల్‌గా పేర్కొంది. యూఏఈ వాసిని హత్య చేసిన కేసులో మహమ్మద్ రినాష్ దోషిగా తేలాడు.
ఇక మురళీధరన్‌కు ఓ భారతీయుడిని హత్య చేసిన కేసులో శిక్ష పడింది. ఇద్దరికీ మరణశిక్ష విధిస్తూ యూఏఈలోని అత్యున్నత న్యాయస్థానం కోర్ట్ ఆఫ్ కాసేషన్ తీర్పు వెలువరించింది. శిక్ష అమలుపై యూఏఈ అధికారులు ఫిబ్రవరి 28న భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు. వీరిద్దరికీ అవసరమైన దౌత్య, న్యాయ సాయం అందజేసినట్టు విదేశాంగశాఖ వెల్లడించింది.
మరణ శిక్ష సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసినట్లు పేర్కొంది. రాయబార కార్యాలయం బాధిత కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. అంత్యక్రియల్లో వారు పాల్గొనేలా చర్యలు తీసుకోనున్నట్టు విదేశాంగ శాఖ తెలిపింది.కాగా, మూడు రోజుల క్రితం యూఏఈ జైలులో భారతీయ మహిళా షెహజాది ఖాన్‌కు ఉరిశిక్ష అమలు చేశారు. ఓ హత్య కేసులో ఆమెకు ఈ శిక్ష విధించారు. దాదాపు ఏడాది పాటు ఆమె న్యాయపోరాటం చేసినా ఫలితం లభించలేదు. ఫిబ్రవరి 15వ తేదీనే ఆమెను ఉరితీసినా ఆ సమాచారం ఆలస్యంగా వారి కుటుంబ సభ్యులకు చేరింది.
More Stories
ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి వచ్చే వారం భారత్ లో పర్యటన
అక్టోబర్ 26 నుంచి భారత్- చైనాల మధ్య విమాన సర్వీసులు
విదేశీ విద్యార్థులపై ట్రంప్ కొత్త మెలిక