13 రోజులైనా కొలిక్కి రాని ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రమాదం

13 రోజులైనా కొలిక్కి రాని  ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రమాదం
ఎస్ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 13 రోజులు కావస్తున్నా లోపల చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ కనిపించలేదు. అధికార యంత్రాంగం, రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ నుంచి ప్రత్యేకంగా క్యాడవర్ డాగ్స్‌లను రప్పిస్తున్నట్లు డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. 
 
గురువారం  ఉదయం టన్నెల్ వద్ద జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి ఐఐటీ నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనిక అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌, అధికారులతో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఇవాళ ఉదయం ఎన్డీఆర్‌ఎఫ్‌, సింగరేణి, ఐఐటీ నిపుణులతోపాటు సైనిక అధికారులు టన్నెల్ లోపలికి వెళ్ళారు. 
 
ఒక చివర నుంచి మట్టిని తీసి ఎస్కలెటర్‌పై వేస్తూ నీటిని మరో వైపు దారి మళ్ళీస్తూ ముందుకు సాగాలని సూచించారు. సింగరేణి సిబ్బందితోపాటు యాంత్రిక సహకారం తీసుకుంటూ మనుషులు బురదను బయటికి తరలించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
 
మరోవంక, ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం నిజాలను దాచి ఉంచిందని విమర్శలు చెలరేగుతున్నాయి.  ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం జరుగుతుందని ముందే రెండు నివేదికలు హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని చెబుతున్నారు. కార్మికుల ప్రాణాలను ఫణంగా పెట్టి, నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం ముందుకు పోయిందని ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటిస్తూ గతంలో రెండు నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్నా, కేవలం కమీషన్ల కోసమే పనులను నిర్వహించిందని ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయి.  ఆ నివేదికలలో చెప్పిన విధంగానే రెడ్ జోన్ ప్రాంతంలోనే ప్రమాదం జరగడంతో ఆ నివేదికలను బైట పెట్టాలనే డిమాండ్ వెల్లడి అవుతుంది.