కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి రెండో ప్రాధాన్యఓట్లతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యం పొందారు.
ఇదే జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్నీ గెలుచుకున్న బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీని కూడా దక్కించుకోవడం ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరోసారి పట్టు నిరూపించుకుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఓటమితో తన సిటింగ్ స్థానాన్ని కోల్పోయింది.
56 మంది అభ్యర్థులు పోటీ చేసిన కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. తొలి ప్రాధాన్యఓట్లలో ఎవరికీ కోటా ఓటు లభించక పోవడంతో ఎలిమినేషన్ పద్ధతిలో రెండో ప్రాధాన్య ఓట్టను లెక్కించి అభ్యర్థి గెలుపును ప్రకటించారు.
ఈ స్థానానికి మొత్తం 2,52,029 ఓట్లు పోల్ కాగా, 28,686 ఓట్లు చెల్లకుండా పోయాయి. చెల్లుబాటైన 2,23,343 ఓట్లలో గెలుపు కోసం 1,11,672 ఓట్లను కోటా ఓట్లుగా నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యఓట్లలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 75,675 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 70,565 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు వచ్చాయి.
ఈ ముగ్గురికి కలిపి 2,06,659 ఓట్లు పోలవగా.. పోటీలో ఉన్న మిగతా 53 మందికి కలిపి 16,684 ఓట్లు పోలయ్యాయి. దీంతో మొదటి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ కోటా ఓటు రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో తొలి రెండు స్థానాల్లో ఉన్న అంజిరెడ్డి, నరేందర్‌రెడ్డి మినహా 54 మంది ఎలిమినేట్ అయినా కోటా ఓట్లు ఎవరికి లభించలేదు.
దీంతో ఆ ఇద్దరిలో అత్యధిక ఓట్లు సాధించిన అంజిరెడ్డిని విజేతగా ప్రకటించారు. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత అంజిరెడ్డి 98,637 ఓట్లతో ప్రథమ స్థానం పొందగా, నరేందర్‌రెడ్డి 93,531 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల ద్వారా అంజిరెడ్డికి అదనంగా 22,962 ఓట్లు రాగా, నరేందర్‌రెడ్డికి 22,966 ఓట్లు వచ్చాయి.
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో సిటింగ్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత టి.జీవన్‌రెడ్డి ఉన్నారు. ఈసారి పోటీకి ఆయన సుముఖత తెలపకపోవడంతో కాంగ్రెస్ అధిష్ఠానం అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్‌రెడ్డిని బరిలోకి దింపింది.
కాంగ్రెస్ టికెట్ ఆశించిన ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అయితే మొదటి నుంచీ గెలుపుపై ధీమాతో ఉన్న కాంగ్రె్‌సకు ఊహించని షాక్ తగిలింది. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నా, మిత్రపక్షంగా సీపీఐ మద్దతు ప్రకటించినా కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోయింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ప్రచారం చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇదే నియోజకవర్గ పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలను కలిగి ఉన్న బీజేపీ అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించి, అనూహ్యంగా పోటీ ఇచ్చి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంతోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా కైవసం చేసుకొని ఈ ప్రాంతంలో తన పట్టును మరింత పెంచుకుంది.
బీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలపకపోగా పోలింగ్‌కు ఒకరోజు ముందు బీసీ అభ్యర్థికి ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు వివిధ ప్రాంతాల్లో ప్రకటనలు చేశారు.
పరిపాలనాపరంగా ఇప్పటికే పలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిట్టింగ్ స్థానం కోల్పోవడం ఇబ్బందికరంగా మారింది.
పైగా, గత ఎన్నికలలో బిఆర్ఎస్ హావలో సహితం ప్రతిపక్షంలో ఉంది గెలుపొందిన సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిని పక్కన పెట్టి, కొత్త అభ్యర్థిని రంగంలోకి తెచ్చి గెలిపించుకోలేక పోవడంతో రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టకు దెబ్బగా భావిస్తున్నారు. మూడు ఎమ్యెల్సీ స్థానాలకు ఉపాధ్యాయులు, పట్టభద్రుల నుండి ఎన్నికలు జరుగగా బిజెపి రెండు సీట్లు గెల్చుకోవడం, కాంగ్రెస్ ఒక్కచోట మాత్రమే పోటీ చేసి ఓటమి చెందటం, బిఆర్ఎస్ అసలు ఎన్నికలకు దూరంగా ఉండటం గమనార్హం.
రాష్ట్రంలో కాంగ్రె్‌సకు కౌంట్‌డౌన్ మొదలయిందని, ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించిన సందర్భంగా బుధవారం రాత్రి కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియం వద్ద బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి.
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండింటిని కైవసం చేసుకోవడం పార్టీ బలాన్ని, ప్రజాదరణను మరోసారి స్పష్టంగా చాటిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి హర్షం ప్రకటించారు. ఈ విజయాన్ని అందించిన తెలంగాణ మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులందరికీ, ఈ విజయం కోసం శ్రమించిన పార్టీ కార్యకర్తలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించడం, ఇదే నియోజకవర్గం నుంచి ఉాపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య గెలవడం గర్వకారణం అంటూ హర్షం ప్రకటించారు. ఈ విజయాన్ని సాధించేందుకు పాటుపడిన మేధావులకు, పట్టభద్రులకు, పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదములు తెలిపారు.
More Stories
మంత్రి కొండా సురేఖపై నాగార్జున కేసు ఉపసంహరణ
మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై అటవీ భూముల ఆక్రమణ కేసు
10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు కట్టేందుకు కిషన్ రెడ్డి చొరవ