లోహియా కంటే ఔరంగజేబే సమాజ్‌వాది పార్టీకి ఆరాధ్యదైవం

లోహియా కంటే ఔరంగజేబే సమాజ్‌వాది పార్టీకి ఆరాధ్యదైవం

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్‌ ను పొగుడుతూ వివాదంలో చిక్కుకున్న సమజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా కంటే ఔరంగజేబే సమాజ్‌వాది పార్టీకి ఆరాధ్యదైవం అయ్యాడని విమర్శించారు. అబు అజ్మీని పార్టీ నుంచి ఎందుకు తొలగించలేదని సమాజ్‌వాదీ పార్టీని ఆయన నిలదీశారు.

ఏ వ్యక్తి పేరు చెప్పి (లోహియా) రాజకీయాలు నడుపుతున్నారో ఆయన సిద్ధాంతాలకు సమజ్‌వాదీ పార్టీ దూరమైందని, ఇప్పుడు లోహియా కంటే ఔరంగబేజే ఆ పార్టీకి ఎక్కువయ్యాడని యోగి ఆదిత్యనాథ్ యూపీ అసెంబ్లీలో మాట్లాడుతూ విమర్శించారు.

 “ఆయనను (అబూ అజ్మీ)ఎస్‌పీ నుంచి తొలగించండి. యూపీకి పంపండి. ఆయనకు మేము ట్రీట్‌మెంట్ ఇస్తాం. ఛత్రపతి శివాజీ మహరాజ్ వారసత్వాన్ని కించపరచి, ఔరంగబేబును దేవుడిగా భావిస్తున్న వ్యక్తికి మన దేశంలో నివసించే హక్కు ఉందా?” అని యోగి ప్రశ్నించారు. తన ప్రశ్నకు సమాజ్‌వాదీ పార్టీ సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 

ఒకవైపు మహాకుంభ్‌ను విమర్శిస్తూ, మరోవైపు దేశంలోని ఆలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబ్‌ వంటి వ్యక్తిని పొడుగుతున్నారని, సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు కంట్రోల్ చేయడం లేదో ఎస్పీ వివరణ ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.

మహారాష్ట్రకు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఔరంగజేబ్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన సమర్ధుడైన పాలకుడని, క్రూరుడు కాదని ప్రశంసించారు. ఔరంగజేబ్ హిందూ వ్యతిరేకి కాదని, ఆయన పాలనాయంత్రాగంలో 34 శాతం మంది హిందువులు ఉన్నారని, అనేక మంది హిందువులు సలహాదారులుగా ఉన్నారని చెప్పారు.

ఆయనే మత మార్పిడి జరిపి ఉంటే ఇప్పుడు హిందువుల పరిస్థతి ఎలా ఉండేదే ఊహించుకోవచ్చని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో అబూ అజ్మీ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తాను ఛత్రపతి శివాజీ మహరాజ్‌, సంభాజీ మహరాజ్ గురించి కానీ ఇతర గొప్ప వ్యక్తుల గురించి కానీ ఎలాంటి కించపరచే వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. 

ఒకవేళ ఎవరి మనోభావాలైనా గాయపడి ఉంటే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాగా, వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో మహారాష్ట్రలో దుమారం చెలరేగడంతో అబూ అజ్మీని ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేశారు. కాగా, అబూ ఆజ్మీని ప్రస్తుత సమావేశాల వరకు మాత్రమే కాకుండా శాశ్వతంగా అసెంబ్లీ నుండి బహిష్కరించాలని మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేశారు.