
అందుబాటు ధరల్లో వైద్య సంరక్షణ, సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రోత్సాహకంగా మారిందని వ్యాఖ్యానించింది.
ప్రైవేట్ ఆస్పత్రులన్నీ రోగులు, వారి బంధువులతో బలవంతంగా అధికధరలతో కూడిన మందులను కొనుగోలు చేయిస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై తాజాగా, సుప్రీంలో విచారణ జరిగింది. తమ ఫార్మసీల నుంచే ఔషధాలు కొనుగోలు చేయాలని రోగులను బలవంతం చేయకుండా ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు.
నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, దానివల్ల రోగులు దోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నారు. పిటిసనర్ వాదనతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది. రోగులకు సూచించిన ఔషధం వేరే చోట తక్కువ ధరకు లభిస్తున్నప్పుడు దానిని తమ ఫార్మసీ లోనే కొనుగోలు చేయాలని ప్రైవేట్ ఆస్పత్రులు బలవంతం చేయకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
ముఖ్యంగా సమాజంలోని పేద వర్గాలకు ప్రాణాధార ఔసధాలు అందుబాటు ధరల్లో లభించడం కష్టమై పోయిందని వ్యాఖ్యానించింది. పౌరులు ఈ రకమైన దోపిడీకి గురికాకుండా రక్షించేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇదే విషయమై గతంలో సుప్రీంకోర్టు రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది.
వాటికి ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు స్పందించాయి. కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ధరల నియంత్రణ ఆదేశాల పైనే తాము ఆధారపడతామని పేర్కొన్నాయి. అత్యవసర ఔషధాలు అందుబాటు రేటుల్లో అభ్యమయ్యేలా చూసేందుకు వాటి ధరలను నిర్ణయించినట్టు తెలిపాయి. ఆస్పత్రి లోని ఫార్మసీ లోని మందులు కొనుగోలు చేయాలనే ఒత్తిడి ఏదీ లేదని కేంద్రం కోర్టుకు సమాధానమిచ్చింది.
More Stories
500 బిలియన్ డాలర్ల సంపద కలిగిన తొలి వ్యక్తిగా ఎలాన్ మస్క్
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్