
గాయపడిన, ఇబ్బందుల్లో ఉన్న జంతువులను సంరక్షించే లక్ష్యంతో ‘వంతారా’ కార్యక్రమాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత్ అంబానీ ప్రారంభించారు. వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రమైన ఈ వంతారాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించారు. ప్రధాని మోదీ ప్రస్తుతం తన సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
సోమవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా గిర్ అడవుల్లో సఫారీకి వెళ్లారు. మంగళవారం జామ్‌నగర్ లోని వంతారాను సందర్శించారు. వన్యప్రాణుల ఆసుపత్రిని, జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు, ఐసియులు మొదలైన వాటితో కూడిన పశువైద్య సౌకర్యాలను వీక్షించారు. అంతే కాకుండా వైల్డ్‌లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ మొదలైన అనేక విభాగాలను కూడా పరిశీలించారు.
వంతారాలో పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులతో ప్రధాని సన్నిహితంగా మెలిగారు. అక్కడ సింహాల పిల్లలకు, జిరాఫీలకు ఆహారం అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దేశ, విదేశాల్లో గాయపడిన, ప్రమాదంలో చిక్కుకున్న జంతువులను కాపాడి, చికిత్స చేసి, సంరక్షించి, పునరావాసం కల్పించడం ‘వంతారా’ ముఖ్య లక్ష్యం.
వంతారా అనేది కృత్రిమ అడవి. గుజరాత్‌లోని జామ్‌నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్‌లో 3 వేల ఎకరాల్లో ఇది ఉన్నది. ఈ అడవిలో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా దవాఖాన ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇందులో దాదాపు 2వేల వన్యప్రాణులను సంరక్షిస్తున్నారు. వేల సంఖ్యలో ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు.
More Stories
మల్లోజుల వేణుగోపాల్ ద్రోహి.. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవంకు ముఖ్యఅతిధిగా మాజీ రాష్ట్రపతి
ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మృతి