టెస్లా కార్యాలయాల ఎదుట నిరసనల హోరు

టెస్లా కార్యాలయాల ఎదుట నిరసనల హోరు
అమెరికాలో ప్రభుత్వ సమర్థత పేరిట సంక్షేమ పథకాలను కుదిస్తూ నిధుల కోత విధిస్తుండటంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ మిత్రుడు, టెస్లా గ్రూపు సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలో ప్రభుత్వ వ్యయాలను తగ్గించేందుకు ప్రత్యేకంగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిసియన్సీ (డోజ్‌)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 
 
ట్రంప్‌, ఎలాన్‌ మస్క్‌ తీరును, డోజ్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమెరికాలోని టెస్లా కార్యాలయాల ఎదుట ఆందోళనకారులు ఆదివారం భారీ నిరసన చేపట్టారు. ఉత్తరఅమెరికా, ఐరోపాలో ట్రంప్‌ విధ్వంసకర పాత్రకు పెరుగుతున్న వ్యతిరేకతకు ఈ ప్రదర్శనలు నిదర్శనం. దీనిలో భాగంగా టెస్లా కొనుగోళ్లను అడ్డుకోవాలని, ఆటంకం కలిగించాలని ఆందోళనకారులు భావిస్తున్నారు. 
 
ఇంగ్లండ్‌, స్పెయిన్‌, పోర్చుగల్‌లతో పాటు అమెరికాలోని పలు ప్రాంతాల్లో మరిన్ని నిరసనలు చేపట్టనున్నట్లు ఆందోళనకారులు పేర్కొన్నారు. టెక్సాన్‌, అరిజోనా సహా సెయింట్‌ లూయిస్‌, న్యూయార్క్‌ నగరం, డేటన్‌, ఒహియోబీ షార్లెట్‌, మరియు పాలో ఆల్టో, కాలిఫోర్నియాల్లో కూడా ఇటీవల భారీ ప్రదర్శనలు చేపట్టారు. 
 
ఎలాన్‌ మస్క్‌, ట్రంప్‌ విధానాలను నిరసిస్తూ కొంతమంది టెస్లా కార్ల యజమానులు తమ వాహనాలను ధ్వంసం చేసినట్లు స్థానిక మీడియా తమ కథనాల్లో పేర్కొంది. ఇటీవల ట్రంప్‌, మస్క్‌ వేల సంఖ్యలో ఫెడరల్‌ ఉద్యోగుల తొలగించడంతో పాటు ఒప్పందాలను రద్దు చేశారు. యుఎస్‌ఏజన్సీఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌తో సహా ప్రభుత్వ విభాగాలను మూసివేశారు. మస్క్‌ చర్యలు అమెరికా బడ్జెట్‌ను నియంత్రించడానికి, తన సందపను పటిష్టపరుచుకోవడానికి అనేకమార్గాలను అందించి, కాంగ్రెస్‌ను ధిక్కరిస్తున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.