గాజాకు సహాయాన్ని అడ్డుకున్న ఇజ్రాయెల్

గాజాకు సహాయాన్ని అడ్డుకున్న ఇజ్రాయెల్

గాజా స్ట్రిప్‌లోకి అన్ని వస్తువుల ప్రవేశాన్ని, సరఫరాలను ఇజ్రాయెల్ ఆదివారం నిలిపివేసింది. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించాలన్న కొత్త ప్రతిపాదనను హమాస్ ఒప్పుకోకపోతే ‘మరిన్ని పరిణామాలు తప్పవు’ అని ఇజ్రాయెల్ హెచ్చరించింది. కా, ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందాన్ని భగ్నం చేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని హమాస్ ఆరోపించింది. 

సహాయాన్ని నిలిపివేయాలన్న ఇజ్రాయెల్ నిర్ణయం ‘చౌకబారు దోపిడీ, యుద్ధ నేరం, శాంతిపై దాడి’ అని హమాస్ విమర్శించింది. ఏడాది పైగా సంప్రదింపులు సాగిన అనంతరం జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే, ఆ ఒప్పందం ముగిసిందని చెప్పకుండా ఉభయ పక్షాలు పరస్పర ఆరోపణలకు దిగాయి.  

రంజాన్‌, పాస్‌ ఓవర్‌ లేదా ఏప్రిల్‌ 20 వరకు కాల్పుల విరమణ మొదటి దశను పొడిగించే ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నట్లు ఇజ్రాయిల్‌ ఆదివారం తొలుత ప్రకటించింది. అమెరికా పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ నుండి ఈ ప్రతిపాదన వచ్చినట్లు ఇజ్రాయిల్‌ తెలిపింది. మానవతావాద సహాయం పెంపు కూడా భాగంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశ శనివారం ముగిసింది. 

రెండవ దశపై ఉభయ పక్షాలు సంప్రదింపులను ఇంకా ప్రారంభించాల్సి ఉంది. రెండవ దశలో  ఇజ్రాయిల్‌ సైన్యం ఉపసంహరణ, శాశ్వత కాల్పుల విరమణకు బదులుగా హమాస్‌ మిగిలిన బందీలను విడిచిపెట్టాల్సి వుంది. ఈ ఒప్పందం ప్రకారం హమాస్‌ మొదటి రోజు సంగ బందీలను విడుదల చేయాల్సి వుందని, శాశ్వత కాల్పుల విరమణపై ఒప్పందం కుదిరిన తర్వాత మిగిలిన వారిని విడుదల చేయాల్సి వుందని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ కార్యాలయం తెలిపింది.

ప్రస్తుత ఒప్పందాల కింద సంప్రదింపులు సంతృప్తికరంగా లేవని తాము భావించిన పక్షంలో మొదటి దశ తర్వాత ఇజ్రాయెల్ యుద్ధాన్ని తిరిగి ప్రారంభించవచ్చునని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. హమాస్ బందీలను విడుదల చేసి, ‘ఉచిత మధ్యాహ్న భోజనాలు ఇక ఎంత మాత్రం ఉందవ’ని తన మంత్రివర్గంతో చెప్పినట్లయితే కాల్పుల విరమణ కొనసాగుతుందని నెతన్యాహు స్పష్టం చేశారు.