భారతదేశంలో సూఫీ సంప్రదాయం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుందని చెబుతూ సూఫీ సాధువులు కేవలం మసీదులకే పరిమితం కాలేదని, వారు ఖురాన్ అక్షరాలను చదవడంతో పాటు వేదాల పదాలను కూడా విన్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అజాన్ శబ్దానికి భక్తి గీతాల మాధుర్యాన్ని జోడించారని చెప్పారు.
ఏ దేశ సంస్కృతిని, నాగరికతను అర్థం చేసుకోవాలంటే, ఆ దేశ సంగీతాన్ని పరిశీలించాలని, సంగీతం ద్వారా సంస్కృతి వ్యక్తమవుతుందని స్పష్టం చేశారు.
సూఫీ సంగీత ఉత్సవం జహాన్-ఎ-ఖుస్రావు 2025 రజతోత్సవ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభిస్తూ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో, దేశ ప్రజలకు ప్రధాని మోదీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీలోని సుందర్ నర్సరీలో జరిగిన ఈ గ్రాండ్ సూఫీ సంగీత ఉత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, జహాన్-ఎ-ఖుస్రో అనుభవానికి భారతీయ మట్టిలో ఓ ప్రత్యేకత ఉందని చెప్పారు. “హజ్రత్ అమీర్ ఖుస్రో హిందూస్తాన్‌ను స్వర్గంతో పోల్చారు. మన దేశం ఓ స్వర్గపు తోట లాంటిది. ఇక్కడ ప్రతి రంగు, ప్రతి సంస్కృతి ప్రతిబింబిస్తుంది.బహుశా అందుకే సూఫీ సంప్రదాయం హిందూస్తాన్‌కు వచ్చినప్పుడు, అది దాని స్వంత భూమితో అడుగుపెట్టినట్లు అనిపించింది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ఈ సందర్భంగా సంస్కృత భాష గొప్పతనాన్ని ప్రస్తావించారు. “ప్రపంచంలోనే అత్యుత్తమ భాష సంస్కృతం. భారత ఋషులు కేవలం పండితులు మాత్రమే కాదు, గొప్ప తత్వవేత్తలు కూడా. హజ్రత్ అమీర్ ఖుస్రో భారతదేశ గొప్పతనాన్ని గురించి ఎంతో గొప్పగా ప్రస్తావించారు” అని తెలిపారు.
జహాన్-ఎ-ఖుస్రో ఉత్సవం 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. “ఈ 25 ఏళ్లలో ఈ కార్యక్రమం ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకుంది. ఇటువంటి ఉత్సవాలు భారత కళ, సంస్కృతిని నిలిపే గొప్ప వేదికలు” అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా, తెహ్ బజార్‌ను సందర్శించే అవకాశం లభించిందని, అక్కడి సాంప్రదాయ కళాకారుల ప్రతిభను దగ్గరగా చూడగలిగానని ప్రధాని మోదీ తెలిపారు.
“ఇక్కడి నేల స్వభావంలో ఏదో ప్రత్యేకత ఉంది. బహుశా అందుకే సూఫీ సంప్రదాయం హిందూస్తాన్‌కు వచ్చినప్పుడు, అది దాని స్వంత భూమితో అడుగు పెట్టినట్లు అనిపించింది” అని ప్రధాని మోదీ చెప్పారు.
కాగా, వ్యవసాయాభివృద్ధికీ, రైతు సంక్షేమానికీ తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో వ్యవసాయ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ అందుకే, దేశంలోని తక్కువ పంట దిగుబడి, ఉత్పాదకత ఉండే వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించేందుకు పీఎం ధన ధాన్య కృషి యోజన పథకానికి శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా తొలుత ఎంపిక చేసిన 100 జిల్లాల్లో అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. 2025-26 బడ్జెట్‌కు సంబంధించి వ్యవసాయం-గ్రామీణాభివృద్ధిపై ఏర్పాటుచేసిన వెబినార్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన వ్యవసాయ సంబంధ కార్యక్రమాలను ముందుగా మొదలుపెట్టాలని అధికారులను కోరారు. ప్రస్తుతం దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి పెరిగిందని, అయినప్పటికీ దేశీయ వినియోగంలో 20 శాతం ఇప్పటికీ దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోందని చెప్పారు.
ప్రజల్లో పోషకాహారంపై అవగాహన పెరుగుతోందని, అందుకు అనుగుణంగా ఆహార ధాన్యాలు, పాడి పరిశ్రమ, మత్స్య ఉత్పత్తులు మరింత పెరగాల్సి అవసరం ఉందని తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు దాదాపు రూ.3.75 లక్షల కోట్లు అందించామని గుర్తు చేశారు. గత పదేళ్ల క్రితం వ్యవసాయ ఉత్పత్తి దాదాపు 265 మిలియన్ టన్నులు ఉండేదని, అదిప్పుడు 330 మిలియన్ టన్నులకు పెరిగిందని తెలిపారు.
ఉద్యానవన ఉత్పత్తి 350 మిలియన్ టన్నులను దాటిందని స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఐసీఏఆర్ ఆధ్వర్యంలో 2,900కి పైగా కొత్త రకాల పంటలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. అయితే, కొత్త రకాలు రైతులకు అందుబాటులో ధరలో ఉంచేలా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
More Stories
రేపు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!