
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడను కనిపెట్టే రెస్క్యూ ఆపరేషన్ ఒక కొలిక్కి వచ్చింది. సొరంగం ప్రమాదంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది మృతి చెందినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రకటించారు. ఈరోజు ఉదయం టన్నెల్ ప్రమాదస్థల ప్రాంతానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి చేరుకుని అక్కడి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ టన్నెల్లో సహాయక చర్యల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి వరకు నలుగురి ఆచూకీ దొరుకుతుందని చెప్పారు. మిగిలిన వారి ఆచూకీకి మరింత సమయం పడుతుందని తెలిపారు. టన్నెల్ బోరు మిషన్ కట్ చేసి ఆపరేషన్ చేస్తున్నారని చెప్పారు.
టన్నెల్ సహాయక చర్యలపై ప్రతిపక్షాలు ఘటనపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ‘గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్’ (జీపీఆర్) పరికరంతో కార్మికులు చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించారు. రెస్క్యూ బృందాలు శుక్రవారం తెల్లవారుజాము నుంచి జీపీఆర్ ద్వారా జీరో పాయింట్ వరకు చేరుకొని ఆ ప్రదేశమంతా స్కానింగ్ చేశారు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ దగ్గరకు ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యులు కూడా శనివారం చేరుకోవడంతో ఎవ్వరూ సజీవంగా లేరని అర్ధమయింది. ఇదిలా ఉంటే టెన్నల్ దగ్గర ఇప్పటికే మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కూడా సజీవ సమాధి అయ్యారని గుర్తించినట్లు శుక్రవారం సాయంత్రం నుండే కథనాలు వెలువడుతున్నాయి.
అధికారికంగా దీనిని ధ్రువీకరించ లేదు.
మరోవైపు, గత 36 గంటలుగా విరామం లేకుండా రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటికే అక్కడ ఉన్న 11 బృందాలతోపాటు తాజాగా కొత్తగూడెం నుంచి అండర్‌గ్రౌండ్‌లో పనిచేస్తున్న సింగరేణికి చెందిన అనుభవజ్ఞులైన కార్మికులను రప్పించారు. ఎన్డీఆర్ఐ గుర్తించిన స్పాట్ల వద్ద శుక్రవారం ఎన్డీఆర్ఐ, ర్యాట్మైనర్స్ టీం, సింగరేణి బృందంతో హైలెవెల్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగుసార్లు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం శనివారం వరకు కార్మికుల ఆచూకీని కనుక్కోవాలన్న నిర్ణయానికి వచ్చారు. భూమిలో కూరుకుపోయిన వారి ఆచూకీని కనిపెట్టే జీపీఆర్ మిషన్‌తో ఉదయం లోపలికి వెళ్లిన ప్రత్యేక బృందం అతికష్టం మీద సాయంత్రానికి లోపలికి చేరుకొని అనేకసార్లు స్కాన్ చేసింది.
ఆ ప్రదేశం ప్రమాదభరితంగా ఉన్నప్పటికీ, ప్రాణాలకు లెక్కచేయకుండా కచ్చితమైన ఫలితాలను రాబట్టినట్టు తెలుస్తున్నది. ఈ బృందం కార్మికులు చిక్కుకున్నట్టు అనుమానిస్తున్న ఐదు స్పాట్లను గుర్తించి బయటకొచ్చింది. లోపల స్కాన్ చేసి తెచ్చిన రిపోర్టును పరిశీలించి ఆ ఐదు స్పాట్ లోనే కార్మికులు ఉండి ఉంటారని ప్రాథమికంగా నిర్ధారించారు. మార్కింగ్ తర్వాత బురదను తవ్వుతూ త ప్పిపోయిన వారి ఆచూకీ కోసం ఆర్మీ, నేవీ, సింగరేణి టీంను అక్కడికి యుద్ధ ప్రాతిపదికన పంపించారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ