కోమాలో ఉన్న భారతీయ విద్యార్థిని కుటుంబానికి అత్యవసర వీసా

కోమాలో ఉన్న భారతీయ విద్యార్థిని కుటుంబానికి అత్యవసర వీసా

అమెరికాలో కోమాలో ఉన్న భారతీయ విద్యార్థిని కుటుంబానికి అత్యవసర వీసా జారీ చేయడాన్ని  అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు గురువారం పేర్కొన్నాయి.  అత్యవసర వీసా జారీ చేయాలంటూ విద్యార్థిని కుటుంబం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.  విదేశాంగ మంత్రిత్వ శాఖకి చెందిన   అమెరికా  విభాగం ఈ సమస్యను అధికారికంగా లేవనెత్తడానికి, సహాయం కోరడానికి  యుఎస్  చేరుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. 

మెడికల్‌ ఎమర్జెన్సీల కోసం వీసా త్వరగా జారీ చేసే అవకాశం ఉంటుందని  పేర్కొన్నాయి. ఫిబ్రవరి 14న కాలిఫోర్నియాలో జరిగిన ప్రమాదంలో నీలం షిండే (35)కు తీవ్రంగా గాయపడ్డారు. కారు ఢీకొనడంతో  ఆమె తలపై, ఛాతీపై గాయాలయ్యాయి.  ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఆమె కుటుంబానికి ప్రమాదం గురించి తెలిసింది. నీలం షిండే కుటుంబం మహారాష్ట్రలోని సతారాలో నివాసముంటుంది. 

ఆమెకు అత్యవసరంగా బ్రెయిన్ ఆపరేషన్ చేయాల్సి వున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.  ఫిబ్రవరి 16న తమకు  ప్రమాదం గురించి తెలిసిందని, అప్పటి నుండి వీసా కోసం ప్రయత్నిస్తున్నామని విద్యార్థిని తండ్రి తానాజీ షిండే తెలిపారు.

భారతీయ విద్యార్థిని కుటుంబానికి మద్దతుగా ఎన్‌సిపి (ఎస్‌పి) ఎంపి సుప్రియా సూలే సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఆమె తండ్రికి త్వరగా వీసా అందేలా విదేశాంగ మంత్రి ఎస్‌.జయశంకర్‌ సహాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. ఇది ఆందోళనకరమైన సమస్యఅని, మనమందరం కలిసి పరిష్కరించడంలో సహకారం అందించాలని ఆమె పేర్కొన్నారు.