ఉక్రెయిన్ పై ఐరాసలో దాదాపు ఒంటరైన అమెరికా

ఉక్రెయిన్ పై ఐరాసలో దాదాపు ఒంటరైన అమెరికా

యుక్రెయిన్ పై ఐరాస సర్వసభ్య సమావేశం రెండు తీర్మానాలను ఆమోదించగా ఓటింగుకు భారత్‌ గైర్హాజరు అయింది. వీటిలో ఒక దానికి ఉక్రెయిన్‌, యూరోపియన్‌ యూనియన్‌ మద్దతు ఇవ్వగా మరో తీర్మానాన్ని అమెరికా ప్రతిపాదించింది. అయితే అట్లాంటిక్‌ దేశాలు కొన్ని సవరణల ద్వారా తీర్మానాల్లో మార్పులు చేశాయి. 

ఉక్రెయిన్‌ యుద్ధంపై చర్చించేం దుకు అమెరికా, ఫ్రాన్స్‌ అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌ వాషింగ్టన్‌లో సమావేశమైన సమయంలోనే పశ్చిమ దేశాల మధ్య భిన్నాభిప్రాయా లు వ్యక్తం కావడం గమనార్హం. కాల్పుల విరమణ ఏ మేరకు విజయం సాధించిందన్న విషయంపై ఇరువురు నేతలు పరస్పర విరుద్ధంగా స్పందించారు. 

రష్యాకు ఇజ్రాయిల్‌ శాశ్వతంగా భూమిని కోల్పోవా ల్సిందేనని అమెరికా అంటోంది. దీనిపై మాక్రాన్‌ స్పందిస్తూ ‘శాంతి అంటే ఉక్రెయిన్‌ లొంగిపోవడం కాదు. గ్యారంటీలు లేకుండా కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు అర్థమూ కాదు’ అని స్పష్టం చేశారు.

యుద్ధంపై ఈయూ, ఉక్రెయిన్‌ తీర్మానాన్ని ప్రతిపాదించగా అమెరికా, రష్యా, బెలారస్‌, ఉత్తర కొరియా వ్యతిరేకంగా ఓటేశాయి. అయితే తీర్మానానికి అనుకూలంగా 93 ఓట్లు, వ్యతిరేకంగా 18 ఓట్లు వచ్చాయి. భారత్‌, చైనా సహా 65 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయాయి. రష్యా ప్రతిపాదించిన సవరణ కూడా వీగిపోయింది. 

ఇక అమెరికా ప్రతిపాదించిన తీర్మానానికి యూరోపియన్‌ దేశాలు భారీగా సవరణలు ప్రతిపాదించాయి. ఇవన్నీ ఉక్రెయిన్‌కు అనుకూలమైనవే. అమెరికా తీర్మానాన్ని ఐరాస సమావేశం ఆమోదించినప్పటికీ చివరికి దానిని ట్రంప్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సవరణలకు 93 దేశాలు అనుకూలంగా ఓటేయగా కేవలం 8 దేశాలు మాత్రమే వ్యతిరేకించాయి. 73 దేశాలు ఓటింగుకు గైర్హాజరు అయ్యాయి.

రష్యాను విమర్శిస్తూ ఈయూ ప్రతిపాదించిన తీర్మానంపై జరిగిన ఓటింగులో భారత్‌ పాల్గొనలేదు. గత మూడు సంవత్సరాల కాలంలో భారత ప్రభుత్వం ఇంత బహిరంగంగా ఎన్నడూ తన వైఖరిని బహిర్గతం చేయలేదు. అమెరికా ప్రతిపాదించిన తీర్మానంలో కఠినమైన భాషను వాడకపోవడంతో దానికి మద్దతుగా భారత్‌ ఓటింగులో పాల్గొంటుందని అందరూ అనుకున్నారు. 

అయితే రష్యా ఆక్రమణను వ్యతిరేకిస్తూ సవరణ ప్రతిపాదించగానే భారత్‌ ఓటింగుకు దూరమైంది. ఐరాస సమావేశంలో అమెరికా ప్రతిపాదించిన తీర్మానానికి ఫ్రాన్స్‌ తెచ్చిన మూడు కీలక సవరణలు ఆమోదం పొందాయి.

ఉక్రెయిన్‌పై అమెరికా, ఈయూ మధ్య సోమవారం మధ్యాహ్నం జరిగిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. రష్యాను సమర్ధించేలా అమెరికా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దానికి ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. తీర్మానాన్ని 10 దేశాలు సమర్ధించగా యూరోపియన్‌ కౌన్సిల్‌ దేశాలైన ఫ్రాన్స్‌, బ్రిటన్‌, గ్రీస్‌, స్లొవేనియా, డెన్మార్క్‌ గైర్హాజరు అయ్యాయి. దీంతో ఉక్రెయిన్‌పై భద్రతామండలి మొట్టమొదటిసారిగా తీర్మానాన్ని ఆమోదించింది. గతంలో రెండుసార్లు ఆ ప్రయత్నం జరిగినప్పటికీ రష్యా వీటో చేసింది.