
వచ్చే నెల 20వ తేదీలోగా బీజేపీకి నూతన జాతీయ అధ్యక్షుడు ఎన్నిక కానున్నారు. పార్టీ రాష్ట్ర విభాగాల్లో ఎన్నికలు పూర్తికాగానే జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహించనున్నారు. జేపీ నడ్డా వారసుడిగా కొత్త అధ్యక్షుడి ఎన్నిక జనవరిలో జరగాల్సి ఉండగ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, బీజేపీ రాష్ట్ర విభాగాల ఎన్నికలు పెండింగ్లో ఉండటం కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
బీజేపీ రాజ్యాంగం ప్రకారం సగానికి సగం రాష్ట్ర విభాగాలకు ఎన్నికలు జరగక ముందే జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు చేపట్టరాదు. ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకుగాను 12 చోట్ల ఎన్నికలు పూర్తయ్యాయి. రాబోయే కొద్ది వారాల్లో ఆరు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికలు నిర్వహించే వీలుంది. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.
కాగా ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2019 జూన్ 17న పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టి 2020 జనవరి 20 వరకు కొనసాగారు. 2020 జనవరి 20న పార్టీ 11వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై అప్పటి నుంచి పదవిలో కొనసాగుతున్నారు.
బీజేపీ తొలి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి 1980 నుంచి 1986 వరకు పనిచేశారు. లాల్ కృష్ణ అద్వాణి పలుమార్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1986-1990, 1993-1998, 2004-2005 వరకు ఆయన ఆ పదవీ బాధ్యతలు నిర్వహించారు.
మురళీ మనోహర్ జోషి 1991 నుంచి 1993 వరకు, కుషబావు థాకరే 1998 నుంచి 2000 వరకు, బంగారు లక్ష్మణ్ 2000 నుంచి 2001 వరకు, కె జానా కృష్ణమూర్తి 2001 నుంచి 2002 వరకు, ఎం వెంకయ్యనాయుడు 2002 నుంచి 2004 వరకు, రాజ్నాథ్ సింగ్ 2005 నుంచి 2009 వరకు, 2013 నుంచి 2014 వరకు, నితిన్ గడ్కరి 2010 నుంచి 2013 వరకు, అమిత్షా 2014 నుంరి 2017 వరకు, 2017 నుంచి 2020 వరకు అధ్యక్షులుగా పనిచేశారు.
More Stories
మణిపుర్ ప్రజలారా మీ వెంట నేనున్నా….
ఓటు బ్యాంకు రాజకీయాలతో నష్టపోతున్న ఈశాన్యం
అభద్రతా భావంతోనే అమెరికా సుంకాలు