
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసు ఎలా ముందుకు వెళ్లదో తాము చూస్తామని సవాల్ చేశారు.
ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ పార్టీ వదిలినా, బీజేపీ మాత్రం వదిలే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును తీసుకు వచ్చేందుకు విదేశాల్లో ఏమైనా బీజేపీ ప్రభుత్వం ఉందా? అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి చురకలంటించారు.
చీకటి ఒప్పందాలు చేసుకునే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీకే ఉందని పేర్కొంటూ మజ్లీస్, బీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలతోనే కాకుండా దేశ వ్యతిరేక శక్తులతో సైతం ఈ కాంగ్రెస్ పార్టీ చీకటి ఒప్పందాలు చేసుకుందని గుర్తు చేశారు. బీజేపీ ఏం చెబుతుందో అదే చేస్తుందని, ఏం చేస్తుందో అదే చెబుతామని ఆయన పేర్కొన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు తాము బెదరమని చెప్పారు.
రీజినల్ రింగ్ రోడ్డు అనుమతిని రేవంత్ రెడ్డి సీఎం కాకముందే తాను తీసుకు వచ్చానని అలాంటి తనపైనే సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయి దిగజారి మరీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనలాగా తాము మాట్లాడలేమని, తమకు కొద్దో గొప్పో నైతిక విలువలు ఉన్నాయని చెప్పారు.
ఎన్నో దశాబ్దాలుగా ఇదే పార్టీలో ఉండి ఇదే జెండాను మోస్తున్నామని, రేవంత్ రెడ్డిలాగా తాను పార్టీలు మారలేదని, గంటకో మాట మాట్లాడలేదని ధ్వజమెత్తారు. దెయ్యమన్న సోనియాగాంధీ వద్దకు వెళ్లి దేవతంటూ ఆమె కాళ్లు పట్టుకోలేదంటూ రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి చురకలంటించారు. యువతకు సీఎం రేవంత్ ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మారింది పాలకులు మాత్రమే కానీ, పాలన కాదని మండిపడ్డారు.
పాలనలో రెండు పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు. మార్చి 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కోసం తామంతా తీవ్రంగా కష్టపడ్డామని, అందుకే రేవంత్ రెడ్డి కడుపు మంటగా ఉందని విమర్శించారు.
More Stories
డ్రగ్స్ రహిత సమాజం కోసం బిజెపి 3కె రన్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
తెలంగాణ రాజకీయాల్లో శూన్యత .. భర్తీకి బిజెపి సిద్ధం