
ఆరోగ్య సమస్యలకు దారి తీసే ఊబకాయం నియంత్రణకు చర్యలు తీసుకోవలసిందిగా ప్రజలకు ఉద్బోధించిన మరునాడు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై ప్రచారం కోసం వివిధ రంగాలకు చెందిన పది మంది వ్యక్తులను నామినేట్ చేశారు. వారిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, వాణిజ్యవేత్త ఆనంద్ మహీంద్రా, నటుడు మోహన్‌లాల్ కూడా ఉన్నారు.
‘ఊబకాయంపై పోరును బలోపేతం చేయడంలో, ఆహారంలో వంట నూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన కల్పించడంలో తోడ్పడేందుకు ఈ దిగువ వ్యక్తులను నామినేట్ చేయదలిచాను. మన ఉద్యమం భారీ స్థాయికి చేరుకునేలా ఒక్కొక్కరు పది మందిని నామినేట్ చేయవలసిందిగా వారికి విజ్ఞప్తి కూడా చేస్తున్నాను’ అని ప్రధాని మోదీ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు.
ప్రధాని నామినేట్ చేసిన ఇతర ప్రముఖుల్లో భోజ్‌పురి గాయక, నటుడు నిరాహువా, షూటింగ్ చాంపియన్ మను భాకర్, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, నటుడు ఆర్ మాధవన్, గాయని శ్రేయా ఘోషల్, వితరణశీలి, ఎంపి సుధా మూర్తి కూడా ఉన్నారు. ఊబకాయంపై పోరు కోసం గట్టి కృషి జరగాలని ప్రధాని మోదీ ఆదివారం తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఉద్బోధిస్తూ, ఆహారంలో తక్కువగా నూనె వాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నూనె వాడకాన్ని పది శాతం మేర తగ్గించాలన్న సవాల్‌ను మరి పది మందికి విసరవలసిందిగా కూడా ఆయన ప్రజలను కోరారు. వెంటనే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ, ఊబకాయానికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రచారోద్యమంలో చేరడాన్ని తాను ఆనందిస్తున్నానని తెలియజేశారు. ప్రధాని ప్రచారోద్యమంలో చేరేందుకు పది మందిని కూడా సిఎం ఒమర నామినేట్ చేశారు.
‘హృద్రోగం, టైప్ 2 మధుమేహం, పక్షవాతం, శ్వాసకోశ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు, ఆదుర్దా, కుంగుబాటు వంటి మానసిక ఆరోగ్య సమస్యలు పెక్కింటిని ఊబకాయం కలిగిస్తుంది. ఊబకాయానికి వ్యతిరేకంగా ప్రధాని ప్రచారోద్యమంలో చేరేందుకు ఈ దిగువ పది మందిని నేను నామినేట్ చేస్తూ, ఈ పోరును ముందుకు తీసుకువెళ్లేందుకు మరి పది మందిని నామినేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఒమర్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు.
ఒమర్ నామినేట్ చేసిన వారిలో బయోకాన్ ఎండి కిరణ్ మజుందార్ షా, వాణిజ్యవేత్త సజ్జన్ జిందాల్, నటి దీపికా పడుకోణ్, మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, మాజీ క్రికెటర్ ఇర్ఫన్ పఠాన్, ఎంపి సుప్రియా సూలె, మాజీ వుషు క్రీడాకారుడు కుల్దీప్ హండూ ఉన్నారు.
More Stories
మణిపుర్ ప్రజలారా మీ వెంట నేనున్నా….
ఓటు బ్యాంకు రాజకీయాలతో నష్టపోతున్న ఈశాన్యం
అభద్రతా భావంతోనే అమెరికా సుంకాలు