పాకిస్థాన్‌ను చిత్తుచేసిన టీమిండియా

పాకిస్థాన్‌ను చిత్తుచేసిన టీమిండియా
 
* సమిష్టి కృషితో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ రెండో విజయం
 
పాకిస్థాన్‌ను చిత్తుచేసిన టీమిండియా ఐసీసీ టోర్నమెంట్లలో ఆ జట్టుపై ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. ఇప్పటిదాకా ఐసీసీ ఈవెంట్లలో (టీ20 ప్రపంచకప్‌, వన్డే ప్రపంచకప్‌, చాంపియన్స్‌ ట్రోఫీ) ఇరుజట్లు 22 సార్లు తలపడితే, భారత్‌ ఏకంగా 18 విజయాలతో పైచేయి సాధించింది. చాంపియన్స్‌ ట్రోఫీలో మూడుసార్లు (2004, 2009, 2017లో), టీ20 ప్రపంచకప్‌ (2021)లో ఓసారి భారత్‌పై పాక్‌ గెలిచింది.

చాంపియన్స్‌ ట్రోఫీకి తలమానికంగా నిలిచిన దుబాయ్ వేదికగా జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఏకపక్షంగా ముగిసింది. అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టిన టీమిండియా వరుసగా రెండో విజయం అందుకుంది. ఆదివారం పాక్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ (111 బంతుల్లో 7 ఫోర్లతో 100 నాటౌట్‌) అజేయ శతకం సాధించగా, మరో 45 బంతులుండగానే భారత్‌ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది.

తద్వారా 2017 సీటీ ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యింది. గ్రూప్‌ ‘ఎ’లో నాలుగు పాయింట్లతో భారత్‌ దాదాపు సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకోగా, ఆఖరి మ్యాచ్‌ మార్చి 2న కివీస్ తో తలపడుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. సౌద్‌ షకీల్‌ (62), రిజ్వాన్‌ (46), ఖుష్‌దిల్‌ (38) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. 

స్పిన్నర్‌ కుల్దీ్‌పనకు మూడు, హార్దిక్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 42.3 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసి గెలిచింది. శ్రేయాస్‌ (56), గిల్‌ (46) సహకరించారు. విరాట్‌ శతకంలో 72 పరుగులు సింగిల్స్‌, డబుల్స్‌ రూపంలో రావడం అతడి ఫిట్‌నెస్‌ స్థాయిని తెలుపుతుంది. షహీన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా విరాట్‌ కోహ్లీ నిలిచాడు.

ఓ మాదిరి ఛేదనలో భారత్‌ను పాక్‌ బౌలర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. దీనికితోడు వారి పేలవ ఫీల్డింగ్‌ కూడా తోడైంది. అటు విరాట్‌ సెంచరీ, శ్రేయాస్‌ హాఫ్‌ సెంచరీ, గిల్‌ సమన్వయ ఆటతీరుతో జట్టు సునాయాసంగా నెగ్గింది. ఆరంభంలో పేసర్‌ షహీన్‌ సూపర్‌ యార్కర్లతో కట్టడి చేసే ప్రయత్నం చేశాడు. కానీ రోహిత్‌ (20) రెండో ఓవర్‌లో 4,6తో ఎదురుదాడికి దిగాడు. అటు గిల్‌ మూడో ఓవర్‌లో రెండు ఫోర్లతో ఆకట్టుకున్నాడు. దీంతో ఒత్తిడిని తగ్గించారు. 

 
చివరకు షహీన్‌ ఇన్‌స్వింగ్‌ యార్కర్‌కు రోహిత్‌ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అయితే ఈ సంతోషాన్ని గిల్‌-విరాట్‌ వమ్ము చేశారు. షహీన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో గిల్‌ మూడు ఫోర్లతో 14 రన్స్‌ రాబట్టి అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు. పిచ్‌ను అర్థం చేసుకుంటూ ఎక్కువగా సింగిల్స్‌పై దృష్టి సారిస్తూ వీరు స్కోరును ముందుకు నడిపారు. అయితే వరుసగా ఐదో 50+ స్కోరు ఖాయమనిపించిన వేళ గిల్‌ను స్పిన్నర్‌ అబ్రార్‌ బౌల్డ్‌ చేశాడు. 
 
దీంతో రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత విరాట్‌కు జతగా శ్రేయాస్‌ కలవడంతో పాక్‌ బౌలర్ల కష్టాలు రెట్టింపయ్యాయి. అటు బంతి కూడా చక్కగా బ్యాట్‌ మీదకు రావడంతో ఈ జోడీ ఆడుతూ పాడుతూ బ్యాటింగ్‌ సాగించింది. ఈ క్రమంలో ఇద్దరూ హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకోగా, అటు 36వ ఓవర్‌లోనే స్కోరు 200కి చేరింది. 
 
అయితే విజయానికి మరో 28 పరుగుల దూరంలో శ్రేయాస్‌ కవర్స్‌లో ఇచ్చిన క్యాచ్‌ను ఇమామ్‌ గాల్లోకి డైవ్‌ చేస్తూ పట్టేశాడు. తర్వాతి ఓవర్‌లోనే హార్దిక్‌ (8) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో విరాట్‌ శతకానికి, జట్టు విజయానికి సమాన పరుగులు అవసరపడడంతో అభిమానుల్లో కాస్త ఉత్కంఠ నెలకొంది. కానీ 43వ ఓవర్‌లో ఓ చక్కటి ఫోర్‌తో ఆ రెండింటినీ పూర్తి చేసి అందరినీ సంబరాల్లో ముంచెత్తాడు.
టాస్‌ గెలిచిన వెంటనే పాక్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక్కడి పిచ్‌ ఛేజింగ్‌కు కష్టమనే భావనలో ఈ నిర్ణయం తీసుకోగా భారత బౌలర్లు అంత సులువుగా పరుగులేమీ ఇవ్వలేదు. బంతి బ్యాట్‌ మీదకు రాకపోవడంతో పాక్‌ బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు. అయితే సౌద్‌ షకీల్‌ అర్ధసెంచరీ, కెప్టెన్‌ రిజ్వాన్‌ సంయమన ఆటతీరుతో పాటు చివర్లో ఖుష్‌దిల్‌ వేగంతో జట్టు స్కోరు ఫర్వాలేదనిపించింది. 

షమి ఏకంగా ఐదు వైడ్లతో ఓవర్‌ను ఆరంభించడం గమనార్హం. ఇక ఓపెనర్‌ బాబర్‌ ఆజమ్‌ (23) క్రీజులో ఉన్నంత సేపు చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ఐదు ఫోర్లతో జోరు మీదున్న అతడి నుంచి భారీ ఇన్నింగ్స్‌ వస్తుందనిపించినా హార్దిక్‌కు చిక్కాడు. ఆ వెంటనే మరో ఓపెనర్‌ ఇమామ్‌ (10)ను అక్షర్‌ కళ్లుచెదిరే రీతిలో రనౌట్‌ చేయడంతో పవర్‌ప్లేలో పాక్‌ రెండు వికెట్లు కోల్పోయింది. 

ఈ దశలో జట్టుపై ఒత్తిడి పడనీయకుండా కెప్టెన్‌ రిజ్వాన్‌, సౌద్‌ షకీల్‌ మాత్రం పట్టుదలగా ఆడారు. మధ్య ఓవర్లలో పిచ్‌ నెమ్మదించడంతో పరుగులు కష్టమయ్యాయి. ముఖ్యంగా స్పిన్నర్‌ కుల్దీప్‌ ఇబ్బందిపెట్టాడు. వికెట్‌ను కాపాడుకునే క్రమంలో రిజ్వాన్‌-షకీల్‌ జోడీ కూడా ఎలాంటి దూకుడు ప్రదర్శించలేదు. దీంతో 55 బంతులపాటు కనీసం ఫోర్‌ కూడా నమోదుకాలేదు. 

కానీ ఓపికతో ఆడిన ఈ ఇద్దరూ స్కోరును 34వ ఓవర్‌లో 150 దాటించారు. ఇక 24 ఓవర్లపాటు క్రీజులో నిలిచి భారత్‌ను విసిగించిన జోడీకి 34వ ఓవర్‌లో బ్రేక్‌ పడింది. రిజ్వాన్‌ను అక్షర్‌ బౌల్డ్‌ చేయడంతో మూడో వికెట్‌కు 104 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. ఈ వికెట్‌తో పాక్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూడా చెల్లాచెదురైంది. 

హాఫ్‌ సెంచరీతో జోరు మీదున్న షకీల్‌ను తర్వాతి ఓవర్‌లో హార్దిక్‌ దెబ్బతీశాడు. ఆ తర్వాత కుల్దీప్‌ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లతో పాక్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టాడు. చివర్లో ఖుష్‌దిల్‌ మాత్రం బంతికో పరుగు చొప్పున సాధించాడు. తమ ఇన్నింగ్స్‌లో తొలి సిక్సర్‌ను 42వ ఓవర్‌లో అతడే సాధించాడు. ఆఖరి ఓవర్‌లో ఖుష్‌దిల్‌ వికెట్‌ను రాణా తీయడంతో పాక్‌ ఆట ముగిసింది.