
ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ శరవేగంగా సాగుతున్నాయని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మార్గం దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుందని, ఈ మార్గంలో మెట్రో రైలు వెళితే కేవలం 40 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చని వెల్లడించారు.
ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్‌కి సంబంధించిన సర్వే పనులను ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ల తర్వాత నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు.
ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత గ్రీన్ సిటీగా ప్రపంచంలోనే అద్భుత నగరాల సరసన చేరాలన్నది సీఎం సంకల్పమని తెలిపారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ సంస్థ హెచ్ఎండీఏ, టీజీ ఐఐసీలతో కలిసి మెట్రో రైల్ విస్తరణ ప్రణాళిక సిద్ధం చేస్తామని ఆయన వివరించారు. దాదాపు 15 వేల ఎకరాల్లో విస్తరించనున్న ఫ్యూచర్ సిటీని కాలుష్య రహిత నగరంగా రూపొందించడంతోపాటు అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో కూడిన ఈ గ్రీన్ కారిడార్ కీలక పాత్ర పోషిస్తుందని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.
రావిర్యాల్ ఎగ్జిట్ నుండి ఇప్పటికే నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు దాదాపు 22 కిలోమీటర్లు కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగుడా, మీర్ ఖాన్ పేట్ వరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 100 మీటర్లు (328 అడుగులు) వెడల్పున నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలో 22 మీటర్లు (72 అడుగులు) మెట్రో రైల్‌కి కేటాయించారని తెలిపారు.
మెట్రో రైల్‌కి కేటాయించిన రోడ్ మధ్య స్థలంలో మెట్రో రైల్ కారిడార్ ఎట్ గ్రేడ్ (భూ తలంపై) మెట్రోగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ విశాలమైన రోడ్ మధ్యలో అదే లెవెల్లో మెట్రో రైల్ ఉంటే దానికి ఇరువైపులా మూడు లేన్ల ప్రధాన రహదారి ఉంటుందని, మెట్రోను, ప్రధాన రహదారిని విభజిస్తూ ఆకర్షణీయమైన చెట్లను, గ్రీనరీని అభివృద్ధి చేస్తామని, ప్రధాన రహదారికి ఇరువైపులా మరల రెండు సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి