54 ఏళ్ల తర్వాత పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య ప్రత్యక్ష వాణిజ్యం

54 ఏళ్ల తర్వాత పాకిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య ప్రత్యక్ష వాణిజ్యం
 
54 ఏళ్ల తర్వాత భారత్ పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల మధ్య ప్రత్యక్ష వాణిజ్యం మళ్లీ మొదలైంది. ఈ క్రమంలో 1971లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ విభజన తర్వాత రెండు దేశాల మధ్య అధికారికంగా ప్రత్యక్ష వాణిజ్యం ప్రారంభించడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్ ఖాసిమ్ నౌకాశ్రయం నుంచి ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత మొదటిసారిగా ఓడ సరుకులతో బంగ్లాదేశ్‌కు వెళ్లినట్లు నివేదికలు చెబుతున్నాయి. 
 
గత ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా అధికారం నుంచి తొలగిపోవడంతో బంగ్లాదేశ్‌ను పాలిస్తున్న మహ్మద్ యూనస్, ఢాకాలో రెడ్ కార్పెట్ పరిచి పాకిస్తాన్‌కు స్వాగతం పలికారు. ఆ క్రమంలోనే మహ్మద్ యూనస్ నిరంతరం బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్‌కు మరింత దగ్గరయ్యారు. దీంతో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ కూడా ఇప్పుడు బంగ్లాదేశ్‌లోకి ఎంట్రీ ఇచ్చి కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

ఈ క్రమంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఇటీవలి ద్వైపాక్షిక వాణిజ్యం రెండు దేశాల మధ్య సంబంధాలకు చారిత్రాత్మక నిర్ణయమని చెప్పవచ్చు. 50,000 టన్నుల పాకిస్తాన్ బియ్యాన్ని ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్తాన్ ద్వారా కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ అంగీకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో ఈ డీల్‌ ఖరారైంది. 

ఈ క్రమంలో పాకిస్తాన్ నుంచి బియ్యం బంగ్లాదేశ్‌కు రెండు విడతలుగా పంపిణీ చేస్తారు. ఇందులో భాగంగానే పాక్ ప్రభుత్వ నౌక 25,000 టన్నుల తొలి సరుకుతో బంగ్లాదేశ్‌కు బయలుదేరింది. అదే సమయంలో దాని రెండో సరుకు మార్చి ప్రారంభంలో పంపించనున్నారు. పాకిస్తాన్ నేషనల్ షిప్పింగ్ కార్పొరేషన్‌కు చెందిన ఓడ ప్రభుత్వ సరుకుతో బంగ్లాదేశ్ నౌకాశ్రయంలోకి రావడం ఇదే మొదటిసారి. 

అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య ఇది మొదటి సముద్ర రవాణా మాత్రం కాదు. గత సంవత్సరం కూడా పాకిస్తాన్ నౌక బంగ్లాదేశ్‌కు వస్తువులతో చేరుకుంది. అయితే గత సంవత్సరం వెళ్లిన ఓడ ఒక ప్రైవేట్ కంపెనీకి చెందినది. 1971 తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వ నౌక ప్రత్యక్ష సముద్ర రవాణా మార్గం ద్వారా బంగ్లాదేశ్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి.