కుంభమేళాలో 60 కోట్ల మంది పుణ్యస్నానం

కుంభమేళాలో 60 కోట్ల మంది పుణ్యస్నానం

* యూపీలోని 90 వేలమంది ఖైదీలకు అవకాశం

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా అంగరంగా వైభవంగా జరుగుతోంది. నిత్యం కోట్లాదిమంది భక్తులు వచ్చి గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. జనవరి 13వ తేదీన ప్రారంభం అయిన మహా కుంభమేళా ముగింపు దశకు వచ్చింది. 
 
ఈనెల 26వ తేదీన మహా శివరాత్రితో మహా కుంభమేళా ముగియనుండగా ఇప్పటివరకు 60 కోట్లమంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ సర్కార్ వెల్లడించింది. భారత్ లోని 110 కోట్ల సనాతన ధర్మం ఆచరించే వారిలో సగం మంది ఇప్పటికే గంగా,యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. 
 
ప్రపంచ జనాభాను సమీక్షించే ప్యూ రీసెర్చ్ ప్రకారం భారత దేశ జనాభా 143 కోట్లు(1.43 బిలియన్). వారిలో 110 కోట్ల (1.10 బిలియన్) మంది సనాతన ధర్మాన్ని ఆచరించే జనం ఉన్నారు. అంటే మహాకుంభమేళాలో ఈపాటికే 55 శాతం మంది సనాతనులు నదీ పుణ్య స్నానం ఆచరించారు. సీతా దేవి (జానకి అమ్మవారు) జన్మస్థలం అయిన నేపాల్ నుంచి 50 లక్షల మంది కంటే ఎక్కువ మంది పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. 
 
ఫిబ్రవరి 18 నాటికే 55 కోట్ల మంది భారతీయులు సంగంలో స్నానం ఆచరించారు. రానున్న మహాశివరాత్రి స్నానానికి ఈ సంఖ్య 65 కోట్లు(650 మిలియన్) దాటుతుందని యుపి ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే మౌని అమావాస్య, మకర సంక్రాంతి, బసంత్ పంచమి సందర్భంగా కోట్లాది మంది పుణ్యస్నానం ఆచరించారన్నది గమనార్హం.
 
ఇలా ఉండగా, ఉత్తర్‌ప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న జైళ్లలోని ఖైదీలకు కూడా కుంభమేళా పుణ్యస్నానాలు చేయించాలని నిర్ణయించుకున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మహా కుంభమేళా నీటిని జైళ్లకే తీసుకువచ్చి ఖైదీలు పుణ్యస్నానాలు చేసేలా చూశారు.

యూపీలోని 75 జైళ్లలో ఉన్న ఖైదీలు త్రివేణీ సంగమంలోని నీటితో పవిత్ర స్నానాలు చేశారని ఉత్తర్‌ప్రదేశ్ జైళ్ల శాఖ మంత్రి దారా సింగ్ స్పష్టం చేశారు. లక్నోలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రయాగ్‌రాజ్‌ నుంచి పవిత్ర జలాలను రాష్ట్రంలోని 75 జైళ్లకు తీసుకువచ్చి 90 వేల మంది ఖైదీలు స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా యూపీలోని 75 జైళ్లలో మొత్తం 90 వేల మంది ఖైదీలు ఉన్నారని యూపీ జైళ్ల డైరెక్టర్ జనరల్(డీజీ) పీవీ రామశాస్త్రి తెలిపారు. పవిత్ర సంగమం నుంచి తెచ్చిన జలాలను అన్ని జైళ్లకు పంపించామని, ఆ నీటిని స్నానాలకు ఉపయోగించే నీటిలో కలిపి, ఆ తర్వాత డ్రమ్ములలో నింపినట్లు చెప్పారు. అనంతరం ఖైదీలంతా ప్రార్థనలు చేసి, పుణ్యస్నానాలు చేశారని వెల్లడించారు. 
 
ప్రయాగ్‌రాజ్‌ నుంచి తెచ్చిన అమృత కలశంతో పూజలు చేసిన తర్వాత ఖైదీలు పుణ్యస్నానాలు చేసినట్లు బాగ్‌పట్ జిల్లా జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా, మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు చేస్తున్న మహిళా భక్తుల వీడియోలను పోస్టు చేసిన వివిధ సోషల్‌ మీడియా ఖాతాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళల ఫొటోలు, వీడియోల ప్రచురణపై అలహాబాద్‌ హైకోర్టు 2019లో నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో యూపీ పోలీసులకు చెందిన సాంకేతిక నిపుణుల బృందం ఇటువంటి ఖాతాలపై 24 గంటలూ నిఘా పెట్టి, కేసులు నమోదు చేస్తోంది. కొత్వాలి పోలీసు స్టేషన్‌లో ఇప్పటికే 17 ఖాతాలపై 3 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇలాంటి వీడియోలు విక్రయిస్తున్న ముగ్గురిని అహ్మదాబాద్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.