
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అరచేతిలో వైకుంఠం చూయిస్తూ ఇదే మా పరిపాలన అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు, 6 గ్యారంటీల అమలు సంగతి దేవుడెరుగు కానీ కాంగ్రెస్ పాలన పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసరడం హాస్యాస్పదమని చెప్పారు.
కాంగ్రెస్ 14 నెలల పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని చర్చకు రావాలని సీఎంను మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవిష్యత్తుకు ఈ మండలి ఎన్నికలు దిశా నిర్దేశం చేయనున్నాయని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, 420 సబ్ గ్యారంటీలలో కొంత మేరకైనా అమలు చేసి బహిరంగ చర్చకు వస్తే బాగుంటుందని హితవు చెప్పారు.
ఎన్నికల్లో పసుపు బోర్డు ప్రభావం ఉంటుందని తెలిపారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, రిజర్వేషన్‌లను స్వాగతిస్తామని చెప్పారు. కానీ ముస్లింలను బీసీ జాబితాలో చేరిస్తే వ్యతిరేకిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీతో బీఆర్ఎస్‌కు ఎలాంటి సంబంధాలు లేవని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ తో కలిసేందుకు బిఆర్ఎస్ ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి ఆరోపించారు.
గతంలో అనేక సార్లు బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. జిల్లా అధ్యక్షుల నియామకాల ప్రక్రియ తర్వాతే రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు వెంటనే అమలు చేస్తామని గొప్పలు చెప్పి ప్రభుత్వం ఏర్పడి 400 రోజులు పూర్తి కావస్తున్న ఆరు గ్యారెంటీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ధ్వజమెత్తారు.
అందుకే శాసనమండలిలో నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై నిలదీయాలంటే తెలంగాణ సమాజం భారతీయ పార్టీని ఆదరించి ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కేంద్ర మంత్రి కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో బిజెపి అభ్యర్థులు విజయం సాధిస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత