అమెరికా ఏకపక్ష టారిఫ్‌లపై చైనా ఆందోళన

అమెరికా ఏకపక్ష టారిఫ్‌లపై చైనా ఆందోళన

అమెరికా ఏకపక్షంగా విధించిన టారిఫ్‌లపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ)లో చైనా రాయబారి లీ చెంగ్‌గాంగ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ టారిఫ్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలకు కారణమవుతాయని, ప్రమాదకరమైన ప్రభావాలు వుంటాయని ఆయన పేర్కొన్నారు. కొత్త ఏడాదిలో మొదటిసారిగా జరిగిన డబ్ల్యుటిఓ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో తక్షణమే ఈ చర్యలను విరమించాలని ఆయన అమెరికాకు విజ్ఞప్తి చేశారు. 

నిబంధనల ఆధారిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను పరిరక్షించేందుకు అర్ధవంతమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత పక్షాలను ఆయన కోరారు. అమెరికా ఏకపక్షంగా విధించిన ఈ టారిఫ్‌లు చైనా, ఇతర వాణిజ్య భాగస్వామ్య దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా టారిఫ్‌ ప్రకంపనలు కలుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇటువంటి చర్యలు డబ్ల్యుటిఓ నిబంధనలను దారుణంగా ఉల్లంఘిస్తున్నాయని. ఆర్థిక అనిశ్చితిని ఎత్తిచూపుతున్నాయని, అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం కలిగిస్తున్నాయని లీ తెలిపారు. చివరకు నిబంధనలపై నిర్మితమైన బహుళపక్ష వాణిజ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తున్నాయని స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెబుతూ అమెరికా కూడా తన వైఖరిని సరిదిద్దుకోవాలని సూచించారు. 

ఇయు, కెనడా, బ్రెజిల్‌, రష్యాలతో సహా 30కి పైగా డబ్ల్యుటిఓ దేశాలు అమెరికా ఏకపక్ష వైఖరినిపై తీవ్ర ఆందోళనలు వెలిబుచ్చాయి. అధికార రాజకీయాల శకానికి, ఆటవిక న్యాయానికి మళ్ళే పరిస్థితులను నివారించాలని అంతర్జాతీయ సమాజానికి కెనడా, న్యూజీలాండ్‌, సింగపూర్‌లు విజ్ఞప్తి చేశాయి. 

డబ్ల్యుటిఓను ఒక వేదికగా ఉపయోగించుకుని చర్చలు జరపాలని డబ్ల్యుటిఓ డైరెక్టర్‌ జనరల్‌ ఎన్‌గొజి ఒకొంజొ ఇవీలా సభ్య దేశాలను కోరారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తుత వాణిజ్య ఉద్రిక్తతలకు దోహదపడే అంశాలపై కూడా మాట్లాడుకోవాలని ఆమె కోరారు. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో మనందరం ప్రశాంతతను పాటిస్తూ, చర్చలకు ద్వారాలు తెరిచి వుంచాలని ఆమె సూచించారు.

కాగా, పరస్పరం టారిఫ్‌లు విధించే విషయమై ఇతర అన్ని దేశాలతో సహా భారత్‌కు ఎలాంటి మినహాయింపులు లేవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి స్పష్టం చేశారు. టారిఫ్‌ల విషయంలో తనతో ఎవరూ వాదించలేరని స్పష్టం చేశారు. ఈ నెల 13న వైట్‌హౌస్‌లో ట్రంప్‌, ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక భేటీకి కొద్ది గంటల ముందే పరస్పర టారిఫ్‌లపై ట్రంప్‌ ప్రకటన చేశారు. 

ఈ టారిఫ్‌ ప్రణాళిక ప్రకారం ఆయా దేశాలు అమెరికా నుండి దిగుమతి చేసుకున్న ఉత్పత్తులపై ఎంత సుంకమైతే విధిస్తాయో అంతే మొత్తాన్ని అమెరికా, ఆయా దేశాల నుండి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై విధించనుంది. ప్రతి ఒక్క విదేశీ వాణిజ్య భాగస్వామికి సంబంధించి ఈ పరస్పర టారిఫ్‌ అమలవుతుందని చెప్పారు.

”మనం ఇక్కడ ఏం చేయబోతున్నామంటే, పరస్పరం టారిఫ్‌లు విధించుకోబోతున్నాం. మీరు మా ఉత్పత్తులపై ఎంత సుంకం విధిస్తారో, అంతే మొత్తంలో మేం కూడా మీ ఉత్పత్తులపై సుంకం విధిస్తాం.” అని ప్రధాని మోదీకి స్పష్టం చేసినట్లు ట్రంప్‌ చెప్పారు. ”ఈలోగా మోదీ ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. నో, నో, మీరేమీ చెప్పొద్దు, నాకిష్టం లేదు. మీరే ఏదైతే చార్జీ విధిస్తారో మేం కూడా అదే చార్జీలు విధిస్తాం. ప్రతి దేశంతోనూ మేం ఇలాగే వ్యవహరిస్తాం.” అని తేల్చి చెప్పినట్లు ట్రంప్‌ చెప్పారు.