
ప్రయాగ్‌రాజ్‌లోని ని త్రివేణి సంగమం వద్ద నది నీటిలో మల విసర్జనాల సంబంధ కోలీఫామ్ బ్యాక్టీరియా సాధారణ స్థాయి కంటే అత్యధికంగా ఉందని , స్నానం చేయడానికి తగిన ప్రమాణాలకు అనుగుణంగా నీరు లేదని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెల్లడించింది. అయితే, త్రివేణీ సంగమం వద్ద నదిలో నీరు కలుషితమైందని సాగుతున్న ప్రచారాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఖండించారు.
బుధవారం ఆయన యూపీ అసెంబ్లీలో మాట్లాడుతూ కుంభమేళా గొప్పతనాన్ని పునరుద్ఘాటించారు. సనాతన ధర్మం, గంగానది, భారతదేశం, మహా కుంభమేళాపై నిరాధార ఆరోపణలు చేస్తూ, నకిలీ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు చేసిన 56.25 కోట్ల మంది ప్రజల విశ్వాపాలతో ఆడుకోవడమే అని స్పష్టం చేశారు.
త్రివేణీ సంగమంలోని నీరు స్నానాలు చేయడానికే కాదు తాగడానికి కూడా పనికొస్తుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ఫీకల్ బ్యాక్టీరియా నివేదిక తర్వాత కుంభమేళాను కించపరిచేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. నీటి నాణ్యతపై యూపీ పీసీబీ నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు.
సంగమంలోని నీరు పవిత్ర స్నానం చేసేందుకు అన్ని విధాలుగా అనుగుణంగా ఉందని ఆయన అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. సంగం పరిసర ప్రాంతాల్లోని అన్ని పైపులు, డ్రెయిన్‌లకు టేప్‌లు వేసి శుద్ధి చేసిన తర్వాతే నీటిని విడుదల చేస్తున్నారని చెప్పారు. “ఉత్తర్‌ప్రదేశ్ కాలుష్య నివారణ బోర్డు నిరంతరం నీళ్ల శుద్ధిని పర్యవేక్షిస్తుంది. నివేదికల ప్రకారం నీటి యొక్క బిఒడి 3 కంటే తక్కువగా ఉంది. ఆక్సిజన్ శాతం 8-9 వరకూ ఉంది. కాబట్టి ఈ నీళ్లు స్నానం చేయడానికే కాదు.. ఆచమనం చేసుకుందుకు కూడా పనికి వస్తాయి” అని యోగి తేల్చి చెప్పారు.
“ఈ కార్యక్రమాన్ని ఏ ప్రత్యేక పార్టీ లేదా ప్రభుత్వం నిర్వహించలేదు. ఇది సమాజానికి చెందినది. అయితే ప్రభుత్వం దానిని సులభతరం చేస్తుంది. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి మేము సేవకులుగా ఉన్నాము. పండుగకు ఇంకా ఏడు రోజులు మిగిలి ఉన్నాయి. ఈ మధ్యాహ్నం నాటికి, 56 కోట్ల 26 లక్షల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు” అని వివరించారు.
బుధవారం నివేదికల ప్రకారం సంగమం వద్ద నీటిలో బీవోడీ పరిమాణం 3 కంటే తక్కువగానే ఉందని, డిజాల్వ్‌డ్ ఆక్సిజన్ (డీవో) 8 నుంచి 9 వరకూ నమోదైందని యోగి వివరించారు. దీని ప్రకారం సంగమంలోని నీరు స్నానాలకే కాదు ఆచమనానికి కూడా అనుకూలమేనని స్పష్టం చేశారు. మహాకుంభమేళాలో ఇంకా ఏడు రోజులు మిగిలి ఉన్నాయని గుర్తు చేశారు.
సనాతన ధర్మం, గంగామాత, భారత్ గురించి తప్పుడు ప్రచారం చేస్తే , 56 కోట్ల మంది విశ్వాసంతో ఆడుకున్నట్టే అని ఆయన హెచ్చరించారు. మహా కుంభమేళాలో గత నెలలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది, ప్రయాగ్ రాజ్ వెళ్లే భక్తుల రద్దీ కారణంగా ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించిన సంగతి తెలిసిందే. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు, రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందినవారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దీన్ని కూడా రాజకీయం చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు.
వీటిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహాకుంభ్ మృత్యు కుంభ్ అని విమర్శించారు. దీనిపై యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ “ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంపై రాజకీయాలు చేయడం ఎంతవరకు సముచితం? తొలిరోజు నుంచి మహాకుంభ్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ శతాబ్దంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉంది. అందుకే తప్పుడు ప్రచారాలు పట్టించుకోకుండా ఈ ప్రపంచం, ఈ దేశం పాల్గొంటోంది” అని తెలిపారు.
కాంగ్రెస్, ఎస్‌పీ, ఆర్‌జేడీ, టీఎంసీ నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం నేరమైతే తమ ప్రభుత్వం ఆ నేరాన్ని చేస్తూనే ఉంటుందని యోగి స్పష్టం చేశారు.
ఇలా ఉండగా, ప్రయాగ్‌రాజ్‌లో రూ.3లక్షల కోట్ల వ్యాపారాన్ని సృష్టించడం ద్వారా మహా కుంభమేళా దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాల్లో ఒకటిగా మారిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కాయిట్) సెక్రటరీ జనరల్, ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. కుంభ్ ప్రారంభానికి ముందు 4 0కోట్ల మంది ప్రజలు వస్తారని, సుమారు రూ.2లక్షల కోట్ల లావాదేవీలు సాగుతాయని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు.
ఇప్పటికీ వెల్లువలా తరలివస్తున్న భక్తులను చూస్తుంటే ఈ నెల 26న కుంభమేళా చివరిరోజు నాటికి వీరి సంఖ్య 60 కోట్లు దాటుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్‌తో పాటు దానికి 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పట్ణణాలు, నగరాల్లో కూడా గణనీయమైన వ్యాపారాభివృద్ధి జరిగిందని తెలిపారు.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?