
ముడా కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ ఊరట కలిగింది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్యతోపాటు ఇతరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని లోకాయుక్త పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు తుది నివేదికను హైకోర్టుకు సమర్పించినట్లు దర్యాప్తు అధికారి తెలిపారు.
ముడా భూముల కేటాయింపుల వివాదంలో కోట్లాది రూపాయల విలువైన భూములను తన భార్య పార్వతికి దక్కేలా సిఎం సిద్ధరామయ్య కుట్ర చేశారంటూ సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టిజె అబ్రహం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై గవర్నర్ విచారణకు అనుమతించారు.
ముడా కేసులో సీఎం సిద్ధరామయ్య, ఆయన సతీమణి పార్వతి, ఆయన బావమరిది మల్లికార్జున స్వామితోపాటు భూ యజమాని దేవరాజు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు ఆదేశించడంతో రాజకీయంగా సంచలనమైంది.
సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూర్‌లోని కేసరే గ్రామంలో మూడెకరాల భూమి ఉంది. ఆ భూమిని ఆమెకు సోదరుడు మల్లికార్జున్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ భూమిని అభివ ద్ధి చేసేందుకు ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూర్‌లో కీలకమైన విజయనగర్‌లో 38,238 చదరపు అడుగుల ప్లాట్లను ప్రభుత్వం కేటాయించింది.
పరిహారం కింద ఇచ్చిన ప్లాట్ల మార్కెట్ విలువ కేసరేలో స్వాధీనం చేసుకున్న భూమి విలువకంటే ఎక్కువగా ఉంటుందని బిజెపి ఆరోపించింది. భూ కేటాయింపుల్లో దాదాపు రూ.45 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం కలిగించినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య, ఆయన భార్య, కుమారుడు ఎస్ యతీంద్రతో సహా పలువురు సీనియర్ ముడా అధికారులు అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి.
More Stories
2026 నాటికి భారత్ కు ఎస్-400 డెలివరీ పూర్తి
పదేళ్లలో మూడింతలకు పైగా పెరిగిన రాష్ట్రాల అప్పులు
ఉద్యోగ భద్రత కోసమే హెచ్-1బి వీసాల పై ట్రంప్ కన్నెర్ర