
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీపై విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రారంభించినందుకు ఆయనను నిందించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత దాదాపు 3 సంవత్సరాల క్రితమే యుద్ధాన్ని జెలెన్‌స్కీ ముగించి ఉండాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.
మూడేళ్ల క్రితమే రష్యాతో ఒప్పందం ద్వారా ముగించి ఉండాలని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు అమెరికా, రష్యా ప్రయత్నిస్తుంటే చర్చల్లో పాల్గొనబోమని జెలెన్‌స్కీ చెప్పడం ఏంటని మండిపడ్డారు. అమెరికా-రష్యా చర్చల నుంచి తనను మినహాయించడంపై ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
సౌదీ అరేబియాలో అమెరికా, రష్యా దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలకు ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్ ను ఆహ్వానించలేదు. ఉక్రెయిన్ కు ఆహ్వానం లభించకపోవడంతో ఈ చర్చల ఫలితాన్ని తాము అంగీకరించలేమని జెలెన్‌స్కీ పేర్కొనడంతో ట్రంప్ తన అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ మాట్లాడుతూ“మిమ్మల్ని ఆహ్వానించలేదు.. సరే.. మీరు మూడు సంవత్సరాల పాటు యుద్ధంలో ఉన్నారు. దానిని మీరు ముగించి ఉండాలి. యుద్ధాన్ని ప్రారంభించి ఉండకూడదు. ఒక ఒప్పందం కుదుర్చుకుని ఉండవచ్చు” అని అమెరికా అధ్యక్షుడు చెప్పారు.
రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను పరోక్షంగా తప్పుపట్టారు. తక్కువ భూమితో పోయేదాన్ని యుద్ధం వరకూ తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని విమర్శించారు. గత నాలుగేళ్లు తాను అమెరికా అధ్యక్షుడిగా ఉంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరిగేదేకాదని ట్రంప్ స్పష్టం చేశారు.
“నేను ఉక్రెయిన్ కోసం ఓ ఒప్పందం కుదర్చగలను. అది పోగొట్టుకొన్న దాదాపు మొత్తం భూమిని తిరిగి ఇప్పించగలను. ప్రజలు ఎవరూ చనిపోరు. ఏ నగరం నేలమట్టం కావాల్సిన అవసరం రాదు. ఒక్క ఇంటి పైకప్పు కూడా కూలదు. కానీ, వారు అలా జరగకూడదని అనుకొన్నారు” అని ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఉద్దేశించి పేర్కొన్నారు.
అతడి నేతృత్వంలో ఉక్రెయిన్ అతిపెద్ద విధ్వంస ప్రదేశంగా మారిపోయిందని ట్రంప్ మండిపడ్డారు. అసలు ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించాలని, జెలెన్‌స్కీకి కేవలం 4శాతం మాత్రమే ప్రజామద్దతు ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా, ఈ నెలాఖరులో తాను పుతిన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. రష్యా ఈ వినాశనం ఆపడానికి ఏదో చేద్దామనుకుంటోందని అభిప్రాయడ్డారు.
ప్రతి వారం వేల మంది సైనికులు చనిపోతున్నారని గుర్తుచేశారు. తాము దీన్ని ముగించాలనుకొంటున్నట్లు స్పష్టం చేశారు. ఇది బుద్ధి తక్కువ యుద్ధమని ట్రంప్ అభివర్ణించారు. అంతకు ముందు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంపై పుతిన్, జెలెన్‌స్కీ ఇద్దరితోనూ తాను సంప్రదింపులు జరుపుతున్నానని ట్రంప్ చెప్పారు.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్